close

ప్రధానాంశాలు

పాండ్య, రాహుల్‌లకు తలో రూ.20 లక్షల జరిమానా

పదేసి లక్షలు సైనిక కుటుంబాలకు
మిగతా మొత్తం అంధుల క్రికెట్‌ సంఘానికి
మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబుడ్స్‌మన్‌ తీర్పు

ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురైన భారత యువ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌.. ఎట్టకేలకు ఆ వ్యవహారం నుంచి బయటపడ్డారు. ఇప్పటికే సస్పెన్షన్‌ కారణంగా ఒక సిరీస్‌కు దూరమైన వీళ్లిద్దరికీ.. తదుపరి శిక్షలేమీ లేకుండా రూ.20 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఇటీవలే పాండ్య, రాహుల్‌లను విచారించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌.. వీరికి జరిమానాలు విధించడంతో ఈ కేసుకు తెరదించాడు.

దిల్లీ

టీమ్‌ఇండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ ఇక ప్రశాంతంగా క్రికెట్‌ ఆడుకోవచ్చు. కొన్ని నెలల కిందట బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో భాగంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నుంచి వీరు పూర్తిగా బయటపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న వీళ్లిద్దరూ.. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఒకరి తర్వాత ఒకరు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సస్పెన్షన్‌ కూడా ఎదుర్కొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జైన్‌.. తలో రూ.20 లక్షల జరిమానాతో సరిపెట్టాడు. ఇంతటితో ఈ కేసు ముగిసినట్లే. ఐతే పాండ్య, రాహుల్‌ జరిమానా మొత్తాల్ని బీసీసీఐకి కట్టాల్సిన పని లేదు. సైనిక విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పది మంది జవాన్ల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున (ఇద్దరు ఆటగాళ్లు కలిపి మొత్తం రూ.20 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.20 లక్షల మొత్తాన్ని భారత అంధుల క్రికెట్‌ సంఘం సహాయ నిధిలో జమ చేయాలి. నాలుగు వారాల్లోపు వీళ్లిద్దరూ ఈ పని పూర్తి చేయాలని జైన్‌ ఆదేశించాడు. ‘‘వాళ్లిద్దరూ ఆ వ్యాఖ్యల్ని కచ్చితంగా నివారించి ఉండాల్సింది. అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించా. ఇద్దరూ తలో ఐదు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ ఎదుర్కొన్నారు. తమ వ్యాఖ్యల్ని సమర్థించుకోకుండా బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు’’ అని జైన్‌ తెలిపాడు. జనవరిలో ప్రసారమైన టీవీ షోలో పాండ్య, రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఇద్దరూ అమ్మాయిలతో తమకున్న సంబంధాలు, శృంగార కార్యకలాపాల గురించి అనుచితంగా మాట్లాడారు. వీరి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీసీసీఐ వెంటనే స్పందించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీళ్లిద్దరినీ వెంటనే స్వదేశానికి రప్పించింది. సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది. తర్వాత బీసీసీఐ పాలకుల కమిటీ వీరిపై సస్పెన్షన్‌ తొలగించి తదుపరి చర్యల కోసం విచారణకు ఆదేశించింది.



Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net