ప్రధానాంశాలు

Published : 17/05/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Ball Tampering: తెరపైకి కొత్త విషయాలు..!

డేవిడ్ వార్నర్‌ మేనేజర్‌ సంచలన వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: మూడేళ్ల కింద జరిగిన బాల్ టాంపరింగ్‌ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఇప్పుడు మరోసారి కుదిపేస్తోంది. నాటి ప్రధాన సూత్రధారి కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా తాను బంతికి ఉప్పుకాగితం రాయడం తమ బౌలర్లకు కూడా ముందే తెలుసన్నాడు. దాంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పుడు మరోసారి దానిపై విచారణ చేపట్టింది. అయితే, ఈ విషయంపై ఇంకా ఏదైనా కొత్త సమాచారం ఉంటే తెలియజేయాలని కూడా తమ ఆటగాళ్లను కోరింది.

మరోవైపు ఈ ఉదంతం జరిగిన సమయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, ప్రధాన సూత్రధారి కామెరూన్‌ను ఏడాది పాటు ఆటకు దూరం చేసింది. అయితే, ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని వార్నర్‌ మేనేజర్ జేమ్స్‌ ఎర్‌స్కైన్‌ తాజాగా విమర్శించాడు. ఆ ముగ్గురికీ శిక్ష వేసినప్పుడు.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కేసు గెలిచేవారన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో విచారణ సందర్భంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లందర్నీ విచారించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని జేమ్స్‌ అభిప్రాయపడ్డాడు.

‘అప్పుడు విచారణ సందర్భంగా ఆటగాళ్లందర్నీ విచారించలేదు. ఆ ప్రక్రియను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. అదో హాస్యాస్పదమైన విషయం. అప్పుడు అసలేం జరిగిందనే విషయం నాకు తెలుసు. అయితే, దాన్ని ఇప్పుడు బయటపెట్టినా ఏ ప్రయోజం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రజలు కొంతకాలం తర్వాత ఆ జట్టును ఇష్టపడటం లేదు. అప్పుడు వార్నర్‌, స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ పట్ల హేయమైన రీతిలో వ్యవహరించారు. వాళ్లు చేసింది తప్పే అయినా, ఆ శిక్ష సరైందికాదు. వాళ్లు గనుక ఆ విషయంలో న్యాయపరంగా వెళ్లి ఉంటే కచ్చితంగా కేసు గెలిచేవారు. ఎందుకంటే నిజం అలాంటిది’ అని జేమ్స్‌ పేర్కొన్నాడు.

మరోవైపు ఈ విషయంపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు ఆడం గిల్‌క్రిస్ట్‌, మైఖేల్‌ క్లార్క్‌ స్పందించారు. క్లార్క్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ బాల్‌ టాంపరింగ్‌ విషయంలో ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే దాని గురించి తెలిస్తే.. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇక గిల్‌క్రిస్ట్‌ మరో మాధ్యమంలో స్పందిస్తూ.. ఈ బాల్‌ టాంపరింగ్‌ వివాదం ఎప్పటికీ తెరమీదే ఉంటుందని చెప్పాడు. ఆ ఉదంతంలో అసలైన నిజం తెలియాలంటే మరింత లోతైన విచారణ చేపట్టాలని సూచించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌ గురించి బాన్‌క్రాఫ్ట్‌ లాగే ఇంకొంత మందికీ తగిన సమాచారం తెలుసని, ఆ పేర్లను బయటపెట్టడం కోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ఏదో ఒక సందర్భంలో ఆ పేర్లు బయటకు వస్తాయని మాజీ కీపర్‌ బలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net