ప్రధానాంశాలు

Published : 19/06/2021 08:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: స్మార్ట్‌ఫోన్‌ సాయంతో కొవిడ్‌ నిర్ధారణ

టొరంటో: కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షను చాలా సులువుగా నిర్వహించడంతోపాటు బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కెనడా శాస్త్రవేత్తలు ఒక విధానాన్ని కనుగొన్నారు. స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా సాయంతో చేపట్టే ఈ పరీక్ష వల్ల కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించొచ్చు. కరోనా నిర్ధారణ పరీక్షలో.. నమూనాలను సేకరించడం, వాటిని ల్యాబ్‌కు పంపడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాన్ని తెలియజేయడం వంటి అనేక దశలు ఉంటాయి. ఫలితంగా దీనికి చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత క్వాంటమ్‌ బార్‌కోడ్‌ సీరోలాజికల్‌ ఆసే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం క్వాంటమ్‌ డాట్‌ బార్‌కోడ్‌తో కూడిన సూక్ష్మ పూసలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అలాగే రోగి రక్తంలో కొవిడ్‌-19 యాంటిజెన్‌కు సంబంధించిన యాంటీబాడీలను గాలించేందుకు సెకండరీ లేబుల్‌ను రూపొందించారు. రక్త నమూనాలో యాంటీబాడీలు ఉంటే సూక్ష్మ పూస రంగు మారిపోతుంది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో ఈ పూసను క్లిక్‌మనిపించాలి. ఫోన్‌లోని ప్రత్యేక యాప్‌ ఈ ఫొటోను ప్రాసెస్‌ చేసి, పూసలో చోటుచేసుకున్న మార్పులను విశ్లేషిస్తుంది. అంతిమంగా ఈ డేటా సమగ్ర మదింపు జరిపి, ఆ వివరాలను తెలియజేస్తుంది. వాటిని వైద్య నిపుణులకూ పంపుతుంది. రక్త నమూనాలోని కీలక బయోమార్కర్లు స్వల్ప స్థాయిలో ఉన్నా ఇది గుర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net