
తాజా వార్తలు
పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే: జగన్
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017-18లో సాంకేతిక కమిటీ, రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు పోలవరం నిధుల అంశంపై ఈ నెల 28న ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. సవరించిన అంచనాలను సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించాయని చెప్పారు. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన అంచనా మొత్తం అవమానకరంగా ఉందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని గుర్తు చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. నిర్వహణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని విభజన చట్టంలో పేర్కొన్నట్లు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకుని కేంద్రమే నిర్మాణాన్ని చేపట్టాలని జగన్ కోరారు.