close

తాజా వార్తలు

Updated : 22/09/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ నిరాహార దీక్ష

రాజ్యసభలో కొనసాగుతున్న గందరగోళం
సభ్యుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్‌


దిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదం సందర్భంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌ను నిరససిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. మరోవైపు ఆదివారం కొంతమంది విపక్ష సభ్యులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామాలన్నింటిపై స్పందించిన ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యులను సస్పెండ్‌ చేయడం తమకూ ఇష్టం లేదన్నారు. వెంటనే విపక్షాలు సభకు రావాలని కోరారు. 

సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు వాకౌట్‌...

వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందంటూ వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. వెంటనే వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అలాగే ప్రైవేట్‌ వ్యక్తులు రైతుల నుంచి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కంటే తక్కువకు పంటను కొనుగోలు చేయొద్దన్న నిబంధనను బిల్లులో చేర్చాలని కోరాయి. ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిటీ నివేదిక ఆధారంగానే ఎంఎస్‌పీ అందించాలని డిమాండ్‌ చేశాయి. ఈ డిమాండ్లను పరిష్కరించే వరకు వరకు సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ వాకౌట్‌ చేశాయి. ప్రభుత్వం వీటికి అంగీకరించకపోతే వర్షాకాల సమావేశాల్ని పూర్తిగా బహిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

సభ్యుల ప్రవర్తన తీవ్ర ఆవేదన కలిగించింది...

బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలు ప్రవర్తించిన తీరు తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ అన్నారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ‘‘ఆదివారం సభలో జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను మానసిక వేదనకు గురయ్యాను. గత రెండు రోజులుగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ప్రజాస్వామ్యం ముసుగులో విపక్ష సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారు. ఛైర్మన్‌ స్థానాన్ని బెదిరించేందుకు యత్నించారు. ఇలాంటి చర్యల వల్ల సభా గౌరవానికి ఊహించలేనంత నష్టం వాటిల్లింది. రూల్ బుక్‌ను చించివేసి.. నా పైకి విసిరారు. కొంతమంది బల్లలపై ఎక్కి నిలబడ్డారు. నన్ను అనుచిత పదజాలంతో దూషించారు. ఇదంతా నాకు పదే పదే గుర్తొస్తుంది. నిద్ర పట్టడం లేదు’’ అంటూ లేఖలో హరివంశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

సస్పెండైన ఎంపీలకు తేనీరు.. ప్రధాని ప్రశంస.. 
అంతకుముందుకు సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన కొనసాగించారు. రాత్రి మొత్తం అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిపట్ల సుహృద్భావంతో వ్యవహరించిన హరివంశ్‌ ఉదయం తేనీరు అందజేశారు. కానీ, విపక్ష సభ్యులు దాన్ని తిరస్కరించారు. ఈ చర్యను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘తనపైనే దాడికి చేసి.. అవమానించి.. ధర్నాకు దిగిన ఎంపీలకు వ్యక్తిగతంగా తేనీరు అందించడం హరివంశ్‌ పెద్ద మనసును తెలియజేస్తోంది. ఆయన గొప్పతనాన్ని చాటుతోంది. ఆయన్ని ప్రశంసిస్తున్న యావత్తు దేశ ప్రజల సరసన నేనూ చేరుతున్నాను’’ అంటూ డిప్యూటీ ఛైర్మన్‌ను కొనియాడారు. 

బిల్లులపై చర్చించేందుకు సిద్ధం...
ఈ పరిణామాలపై స్పందించిన పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. అన్ని బిల్లులపై కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదం సందర్భంగా విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా భాదాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. డిప్యూటీ ఛైర్మన్‌ అనేకసార్లు హెచ్చరించినా ఖాతరు చేయలేదన్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ సహా అధికారులు, మార్షల్స్‌పై అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. 

సస్పెన్షన్‌ మాకూ ఇష్టం లేదు.. కానీ,..

ఈ వ్యవహారాలపై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందిస్తూ..‘సభ్యులను సస్పెండ్‌ చేయడం మాకేమీ సంతోషం కాద’ని వ్యాఖ్యానించారు. సభ్యుల అనుచిత ప్రవర్తన వల్లే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏ ఒక్క సభ్యుడికీ తాము వ్యతిరేకం కాదన్నారు. సభకు రావాలని విపక్ష సభ్యుల్ని కోరారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.