close

తాజా వార్తలు

Published : 22/01/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఏపీ సర్కారుకు షాక్‌

మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న అధికార వైకాపా ప్రయత్నాన్ని ప్రతిపక్ష తెదేపా మంగళవారం శాసన మండలిలో వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది. అనూహ్యంగా నిబంధన 71 అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్లు మోహరించి మరీ బిల్లుపై చర్చకు చేసిన విశ్వ ప్రయత్నాలను అడ్డుకుంది. నిబంధన 71మీద తెదేపా ప్రవేశపెట్టిన తీర్మానంపై మంగళవారం రాత్రి ఓటింగ్‌ నిర్వహించగా.. 27 మంది బలపరిచారు. వ్యతిరేకంగా 11 మంది ఓట్లు వేశారు. వీరిలో ఇద్దరు తెదేపా ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చలికాలంలో ఏమిటీ వేడి?

వాతావరణ మార్పుల ప్రభావం రాష్ట్రంపై ఈ శీతాకాలంలో తీవ్రంగా ఉంది. గత పదేళ్లలో తొలిసారి ఉత్తర భారతంలోని హిమాలయాల నుంచి శీతల పవనాలు తెలంగాణ వైపు ఈ శీతాకాలంలో రాలేదు. సాధారణంగా రాష్ట్రంలో చలికాలం అక్టోబరులో మొదలై ఫిబ్రవరితో ముగుస్తుంది. నవంబరు నుంచే హిమాలయాల నుంచి గాలులు రాష్ట్రంవైపు రావడం ఆనవాయితీ. ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ గుర్తించింది. రాత్రిపూట సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నోటు ముందు ఓటు విలవిల

నోటు ముందు ఓటు విలవిలలాడుతోంది...ఎలాగైనా సరే ఓటు దక్కించుకోవాలని నేతలు పోటీపడ్డారు. రాష్ట్ర పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులు కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు...డబ్బులు...బంగారం.. గడియారాలు, విహారయాత్రలు...విందులు...మద్యం చివరకు స్థలాలను ఓట్లకు ఎరగా వేశారు. అత్యధిక స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ఒక్కో ఓటుకు వేల రూపాయలు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. చివరకు ఫోన్‌నంబర్ల ఆధారంగా డబ్బులు బదిలీ చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఒక పుస్తకం అంటే లక్ష..!

మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా ములుగు పోలీసులు ఈ నెల 18న అరెస్టు చేసిన ఓయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చింతకింది కాశీం అలియాస్‌ కార్తిక్‌ రిమాండ్‌ నివేదికలో పోలీసులు సంచలన అంశాలు నమోదుచేశారు. రహస్య(కోడ్‌) భాషలో మావోయిస్టులకు సమాచారం చేరవేయడం దగ్గర్నుంచి, నిధుల వసూళ్లు, యువతను మావోయిస్టు పార్టీలో చేరే దిశగా ప్రేరేపిండం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాసంఘాల నేతలు మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు లేఖలు, మెయిళ్లను ఎన్‌క్రిప్టెడ్‌ విధానంలో కొరియర్ల ద్వారా పంపిస్తున్నారు. విరాళాల తాలూకూ సమాచారంలో రూ.లక్షను ఒక పుస్తకంగా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తత్కాల్‌ సర్పం బుసలు

రైల్వే పరిరక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌) పోలీసులు భారీస్థాయి ఈ-టికెట్‌ కుంభకోణాన్ని భగ్నం చేశారు. ఈ రాకెట్‌కు... ఉగ్రవాద నిధులకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్నారు. తత్కాల్‌ టికెట్లను సాంకేతికంగా పెద్దఎత్తున కొల్లగొడుతున్న గులాం ముస్తఫా (28) అనే వ్యక్తిని భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. ఇతనికి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, దుబాయ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో లంకె ఉన్నట్లు భావిస్తున్నారు. ‘‘ముస్తఫా అలియాస్‌ హమీద్‌ అష్రఫ్‌ వద్ద ఐఆర్‌సీటీసీ వ్యక్తిగత ఖాతాలు (ఐడీలు) 563 ఉన్నాయి. దాదాపు 2400 ఎస్‌బీఐ శాఖలు, 600 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు శాఖల జాబితా అతని వద్ద లభ్యమయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాతావరణ మార్పుల కోసం చాలా చేయాలి

వాతావరణ మార్పులపై తాను చేపట్టిన ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షించినా పుడమి పరిరక్షణ దిశగా ఆచరణాత్మకంగా జరుగుతున్నదేమీ లేదని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ అన్నారు. స్వీడన్‌కు చెందిన ఈ 17 ఏళ్ల యువతి ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ప్రసంగించారు. ‘‘గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా యువత భారీగా ఉద్యమించడంతో వాతావరణ మార్పుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ఒక కోణంలో చూస్తే ప్రజలకు అవగాహన పెరిగింది. వాతావరణం తీవ్ర చర్చనీయాంశమైంది. మరో కోణంలో చూసినప్పుడు చెప్పుకోదగ్గ అంశాలేమీ ఆచరణలోకి రాలేదు’’ అని గ్రెటా వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రూ. 3,592 కోట్ల మేర 14 బ్యాంకులకు టోకరా

ప్రభుత్వ రంగ బ్యాంకులను ముంచిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.  ముంబయికి చెందిన ఎగుమతుల వర్తక సంస్థ ‘ఫ్రాస్ట్‌ ఇంటర్నేనేషనల్‌’... రూ.3,592 కోట్ల మేర 14 బ్యాంకులకు టోకరా వేసింది. కాన్పుర్‌కు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐవోబీ) జోనల్‌ కార్యాలయం ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సంస్థ ప్రస్తుత, మాజీ డైరెక్టర్లకు చెందిన 13 ప్రాంగణాల్లో మంగళవారం సోదాలు చేపట్టింది. ఆ సంస్థకు మొదట్లో రూ.380.65 కోట్ల రుణ సదుపాయం కల్పించిన ఐవోబీ... 2011లో ఆంధ్రాబ్యాంక్‌ సహా 14 బ్యాంకుల కన్సార్షియం ద్వారా రూ.4,061 కోట్ల రుణం అందజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వైద్య సేవలకు ఈఎంఐ

అపోలో హాస్పిటల్స్‌ కో-బ్రాండెడ్‌ హెల్త్‌ ఈఎంఐ కార్డును ఆవిష్కరించింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో కలిసి ఈ కార్డు తీసుకువచ్చినట్లు అపోలో హాస్పిటల్స్‌ పేర్కొంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఛార్జీలు చెల్లింపు విషయంలో ఇబ్బందిపడకుండా ఈ కార్డు ఉపయోగపడుతుందని వివరించింది. ఈ కార్డు ఉన్న పక్షంలో రోగులు తమ వైద్యసేవల ఖర్చులను పన్నెండు నెలల వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించవచ్చని వెల్లడించింది. ఒకేసారి చికిత్స ఖర్చులను భరించలేని వారికి ఈ కార్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వికెట్‌ పడకుండానే.. 

అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో పసికూన జపాన్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఓ ఆటాడుకుంది. ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఈ అసోసియేట్‌ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం జరిగిన పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జపాన్‌.. భారత బౌలర్ల ధాటికి 22.5 ఓవర్లలో కేవలం 41 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (29 నాటౌట్‌; 18 బంతుల్లో 5×4, 1×6), కుమార్‌ కుశాగ్ర (13 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4) ధాటిగా ఆడటంతో భారత్‌ 4.5 ఓవర్లలోనే, వికెట్‌ కోల్పోకుండా విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వందశాతం నవ్వులతో

గత ఏడాది ‘టోటల్‌ ధమాల్‌’తో ప్రేక్షకుల్ని అలరించారు దర్శకుడు ఇంద్రకుమార్‌. ఇప్పుడు ఆయన మరో కామెడీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అజయ్‌ దేవగణ్‌ నటించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ‘తాన్హాజీ’తో విజయాన్ని అందుకున్న అజయ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘భుజ్‌’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘సూర్యవంశీ’లో అతిథి పాత్రలో మెరవనున్నారు. వీటితో పాటు పూర్తిస్థాయి కామెడీ చిత్రంలో నటించాలని భావిస్తున్నారట అజయ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని