close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. మధ్య తరగతికి ఊరట

కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌-19) విరుచుకుపడి ప్రజా జీవితం గందరగోళంలో పడిపోవటానికి తోడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఎదురైన నేపధ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) శుక్రవారం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. వడ్డీ రేట్లు తగ్గింపు, రుణ వాయిదాలు వాయిదా వేయటం, ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచటం, బ్యాంకింగ్‌ వ్యవస్థకు భరోసా ఇవ్వటం... వంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల  మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట కలిగే అవకాశం ఏర్పడింది. రుణ వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాజధానిలో రెడ్‌ జోన్లు

హైదరాబాద్‌ మహానగరంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో దాని నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరు ఉన్న ప్రాంతాలను ‘కొవిడ్‌-19 క్వారంటైన్డ్‌ రెడ్‌ జోన్‌’గా ప్రకటించింది. ఈ ప్రాంతంలోని కిలోమీటరు పరిధిలోని మొత్తం ప్రజలను 14 రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందానగర్‌, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్‌, కొత్తపేట ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. బాధితుడు నివాసమున్న కాలనీలోని కిలోమీటరు పరిధిలో రెడ్‌జోన్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాబోయే రోజులు చాలా కీలకం

కరోనా వ్యాప్తి నియంత్రణలో రాబోయే రోజులు చాలా కీలకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులకు చెప్పారు వ్యాధి నియంత్రణను తేలిగ్గా తీసుకోవద్దు.. మరింత పకడ్బందీగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తో రోజుల తరబడి ఇంటికే పరిమితమవుతున్నందున ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? సాధారణ ప్రజలు, రైతులు, కూలీల ఇబ్బందులు.. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. మంత్రులు జిల్లా స్థాయిలో కలెక్టర్లతో ప్రతి రోజూ మాట్లాడి కరోనా నివారణ చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అరచేతిలో వైద్యం

కరోనా కలవరం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోగులూ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వైద్యుల వద్దకు సంప్రదింపులకు కూడా వారు వెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాలు, గుండె, కాలేయ సమస్యలతో బాధపడేవారికి ఈ మహమ్మారి తీవ్ర సమస్యగా పరిణమించింది. వచ్చే నెల 15 వరకూ రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేయడంతో.. ముందస్తు ప్రణాళిక ద్వారా స్పెషలిస్టు వైద్యనిపుణుల సంప్రదింపులను పొందాలనుకునే వారి కోసం కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు ఆన్‌లైన్‌ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పదో తరగతి విద్యార్థులను ఇంటర్‌కు ప్రమోట్‌ చేయాలి

కరోనా విస్తృతి దృష్ట్యా ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్‌ డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని శుక్రవారం ప్రకటనలో కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 14 రోజుల తరవాతే సిలిండరు నమోదు

వంట గ్యాస్‌ సిలిండర్లకు అనూహ్యంగా డిమాండు పెరగటంతో గ్యాస్‌ కంపెనీలు ఆంక్షలు విధించాయి. బుక్‌ చేసిన సిలిండరు డెలివరీ అయిన 14 రోజుల తరవాత మాత్రమే మరో దానిని బుక్‌ చేసుకునేలా గ్యాస్‌ కంపెనీలు నిర్ణయించాయి. భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీలు శుక్రవారం నుంచి ఈ నిబంధనను అమలు చేయగా.. ఇండేన్‌ కంపెనీ శనివారం నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సిలిండరు వచ్చిన 24 గంటల తరవాత మరొకటి నమోదు చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ప్రజలు ముందు జాగ్రత్తగా సిలిండర్లు బుక్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అన్నార్తులకు ఆసరాగా ఈటీవీ భారత్‌

దేశవ్యాప్త మూసివేత కారణంగా వివిధ ప్రాంతాల్లో వలస కూలీలు పడుతున్న ఇక్కట్లపై ‘ఈటీవీ భారత్‌’ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారి ఆకలి కేకలపై కథనాలు అందిచడమే కాకుండా... అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వాటికి పరిష్కారం చూపుతోంది. రాజస్థాన్‌లోని జైపుర్‌లో శుక్రవారం ఓ ట్రక్కులో కూలీలు వెళ్తుండటాన్ని ‘ఈటీవీ భారత్‌’ స్థానిక ప్రతినిధి గమనించారు. ఎక్కడకు వెళ్తున్నారని ఆరా తీయగా... లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేవని, తిండి దొరకడంలేదని, చేసేది లేక సొంతూళ్లకు వెళ్తున్నట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్‌

కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అధిపతి క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్థమాన దేశాలను ఆదుకోవడానికి భారీగా నిధులు అవసరమని తెలిపారు. ‘‘మనం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోయాం. 2009లో తలెత్తిన పరిస్థితి కన్నా ఇది చాలా దారుణంగా ఉంటుంది’’ అని ఆమె మంగళవారం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకస్మికంగా ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడినందువల్ల వర్థమాన దేశాల ఆర్థిక అవసరాలు తీర్చడానికి కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రత్యామ్నాయాలపై ఐసీసీ చర్చ

కరోనా వైరస్‌ భయపెడుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సహా ప్రధాన క్రికెట్‌ టోర్నమెంట్లకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి శుక్రవారం ఐసీసీ బోర్డు చర్చించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో భారత్‌ తరఫున బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పాల్గొన్నాడు. కరోనా కారణంగా అనేక ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కూడా రద్దయ్యే ప్రమాదంలో పడ్డ సంగతి తెలిసిందే. ‘‘ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగంపై కరోనా చూపిస్తోన్న ప్రభావం గురించి చర్చించాం’’ అని అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంట్లోనే దూరంగా ఉంటున్నాం

నిత్యం షూటింగులు, సినిమా ప్రచారాలతో తీరిక లేకుండా గడిపేసే సినిమా తారలు కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన కొందరు స్వీయ నిర్బంధంలో ఉంటే లాక్‌డౌన్‌తో మిగిలిన తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి నచ్చిన కాలక్షేపం వాళ్లు చేస్తున్నారు. ఆ విశేషాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచిస్తున్నారు. బాలీవుడ్‌ యువనాయిక అనన్యాపాండే విరామ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు చెబుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.