
తాజా వార్తలు
మేఘాలయ ముఖ్యమంత్రి టాలెంట్ చూశారా?
ఇంటర్నెట్ డెస్క్: రాజకీయవేత్తగా ప్రజాదరణ పొందిన మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, ఈసారి తన గిటార్ నైపుణ్యంతో ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బ్రిటన్ పాశ్చాత్య సంగీత బృందం ఐరన్ మెయిడెన్కు చెందిన ‘వేస్టెడ్ ఇయర్స్’ ఆల్బంలోని గీతాన్ని ఆయన తన గిటార్పై వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సంగ్మా ఇన్స్టాగ్రామ్లో షేర్చేశారు. ‘‘మూడు రోజుల బిజీ బిజీ అసెంబ్లీ సమావేశాల అనంతరం... ఐరన్ మెయిడన్ గీతాలతో సేద తీరుతున్నాను. గిటార్ వాయించి చాలా కాలమైంది... కొన్ని తప్పులు ఉండచ్చేమో...’’ అంటూ వ్యాఖ్యానాన్ని జోడించారు.
42 సంవత్సరాల కొన్రాడ్ సంగ్మా లోక్సభ మాజీ స్పీకర్ దివంగత పీఏ సంగ్మా కుమారుడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (అమెరికా), ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్లలో ఉన్నత విద్యను అభ్యసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహించటమే కాకుండా, మేఘాలయ క్రికెట్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కొద్ది గంటల క్రితం సంగ్మా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే సుమారు నలభై ఐదు వేలకు మంది చూశారు. అంతేకాకుండా, సంగ్మా లెజెండ్ అని, ఆయన పాట వినడానికి చాలా హాయిగా ఉందని, దేశంలోని ముఖ్యమంత్రులలో ఆయనే మోస్ట్ టాలెంటెడ్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని గీతాలు వినిపించాలంటూ పలువురు ఆయనను కోరటం విశేషం. పాశ్చాత్య సంగీతంతో పరిచయం లేనివారు కూడా ఇష్టపడేంత మధురంగా ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి.