
తాజా వార్తలు
‘హెలికాప్టర్ మనీ’పై న్యూజిలాండ్ చర్చలు..!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటకే పలు దేశాలు ఉద్దీపన చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా తాజాగా న్యూజిలాండ్ మరో అడుగు ముందుకు వేసింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా తమ ప్రజలకు నేరుగా డబ్బును అందించే ‘హెలికాప్టర్ మనీ’ విధానాన్ని పరిశీలిస్తున్నామని న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ వెల్లడించారు. అయితే అది కేంద్రీయ బ్యాంక్ ద్వారా ముద్రించి పంచిపెడుతుందా? లేదా ప్రభుత్వం రుణాల ద్వారా సేకరించి ఈ డబ్బును అందుబాటులోకి తెస్తుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఇది సంప్రదింపుల దశలోనే ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇది ఏవిధంగా ఉంటుందనే విషయంపై ఇంకా సుదీర్ఘ చర్చ జరగలేదని బదులిచ్చారు. అయితే, ఈ విధానంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర ఉంటుందని రాబర్ట్సన్ అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ కట్టడికి తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు 21.8శాతం కుచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు ఈ విధానం వరంగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ భారీ నష్టం నుంచి బయటపడేందుకు ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ అక్కడి అధికారిక నగదు రేటును భారీగా తగ్గించింది. అంతేకాకుండా బాండ్లను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని రెట్టింపు చేసింది. ఈ సమయంలో హెలికాప్టర్ విధానం ద్వారా అందుబాటులోకి వచ్చే డబ్బు ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన న్యూజిలాండ్‌కు ఎంతో దోహదపడుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
సంక్షోభ సమయాల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకునేలా చేసేందుకు ప్రజలకు నేరుగా డబ్బును అందించే విధానాన్నే హెలికాప్టర్ మనీగా పరిగణిస్తారు. డిమాండ్‌తో పాటు ద్రవ్యోల్బణం పెంచే ఉద్దేశంతో కేంద్రీయ బ్యాంక్ ఒకేసారి డబ్బు సరఫరాను పెంచి ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రజలకు అందజేస్తుంది. అయితే ఈ విధానంతో కేంద్రీయ బ్యాంక్ స్వతంత్రతకు ముప్పుతో పాటు సుదీర్ఘకాలం ద్రవ్యోల్బణం కొనసాగే ప్రమాదం ఉన్నందున చాలా ధనిక దేశాలు కూడా దీన్ని అమలుచేయడానికి సంకోచిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా న్యూజిలాండ్ ప్రభుత్వం గత నెల నుంచి భారీ స్థాయిలో ఖర్చు పెడుతోంది. ఇలాంటి కఠిన చర్యలతో దాదాపు 48 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్ 1500పాజిటివ్ కేసులు, 21మరణాలు వద్ద కట్టడి చేయగలిగింది.
ఇదిలా ఉంటే, భారత్‌లో కూడా హెలికాప్టర్ మనీపై చర్చ జరిగింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఈ విధానాన్ని పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
భారత్‌లో ఆర్బీఐ తాజా నిర్ణయాలు