Coronavaccine: ప్రపంచానికి సీషెల్స్‌ గుణపాఠం

తాజా వార్తలు

Updated : 25/05/2021 10:19 IST

Coronavaccine: ప్రపంచానికి సీషెల్స్‌ గుణపాఠం

అక్కడ టీకాలు వేశాక కేసులు పెరిగాయ్‌

మాస్కులు, భౌతికదూరం పాటించకపోవటం.. ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడమే కారణం

ఈనాడు - దిల్లీ

ఆ దేశంలో టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది..  జనాభాలో 60 శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయింది. అయినా ఈ నెలలో భారీగా పాజిటివ్‌ కేసులు నమోదు. వీరిలో 33% మంది 2 డోసులు వేసుకున్నవారే! టీకాలు వేసుకున్నామనే ధీమాతో మాస్కులు ధరించకపోవడం.. భౌతికదూరం పాటించకపోవడమే ఇందుకు కారణం.  ఇదీ..  చిన్నదేశమైన సీషెల్స్‌.. ప్రపంచానికి పంపుతున్న సందేశం!

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లు వేసిన దేశాల్లో సీషెల్స్‌ ఒకటి! 98 వేల జనాభా ఉన్న ఈ హిందూ మహాసముద్ర తీర దేశంలో ఇప్పటికే   61.4% జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్‌ అందించారు. అయినా.. కొవిడ్‌ మళ్లీ తలెత్తటం అందరినీ కలవరపెడుతోంది. మే1 నుంచి అక్కడ కోవిడ్‌ కేసులు పెరిగిపోయాయి. ఈనెల 13న ఒక్క రోజులో వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడున్న యాక్టివ్‌ కేసుల్లో 33% మంది పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నవారే కావటం గమనార్హం! దీనర్థం వ్యాక్సిన్‌లు సరిగా పనిచేయడం లేదని కాదని, వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ప్రజలు మాస్కులు, భౌతిక దూరంలాంటి నిబంధనలు పాటించక పోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తలుపులు తెరిచేశారు...

టీకాల కార్యక్రమం సజావుగా సాగటంతో... మే ఆరంభానికి ముందు... సీషెల్స్‌లో 3,800 కేసులు, 16 మరణాలే ఉన్నాయి. కేసుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచేశారు. ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్న పర్యాటకులకు ఎలాంటి క్వారంటైన్‌ నిబంధనలు లేకుండానే తమ దేశానికి రావొచ్చని స్వాగతం పలికారు. ఆంక్షలు ఎత్తేసి, అన్ని కార్యక్రమాలకు అనుమతించడంతో కేసుల సంఖ్య 9,764కు, మరణాలు 35కి పెరిగాయి. వ్యాక్సినేషన్‌ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడమే మహమ్మారి ప్రబలడానికి కారణమైందని ఇప్పుడు అక్కడి పాలకులు పేర్కొంటున్నారు. వ్యాక్సినేషన్‌ తర్వాత కొందరు వైరస్‌ బారినపడ్డప్పటికీ వారిలో లక్షణాలు తీవ్రరూపం దాల్చక పోవటం, ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి కూడా రాకపోవటం, ఎవ్వరూ చనిపోకపోవటం సంతోషించాల్సిన విషయంగా అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు దిగజారకుండా రెండు వ్యాక్సిన్లూ రక్షించాయని అభిప్రాయపడ్డారు. సముద్ర తీరంలో ఎప్పుడూ పార్టీల్లో మునిగితేలే ప్రజలు భౌతికదూరం మరిచిపోవడంవల్లే మహమ్మారి సంక్రమణం జరుగుతోందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ప్రకటించారు.

రెండు వ్యాక్సిన్లు

సీషెల్స్‌లో చైనాకు చెందిన సైనోఫామ్, భారత్‌లో తయారైన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను అందించారు. ఇందులో 18 నుంచి 60 ఏళ్లలోపున్న 57% మంది జనాభాకు చైనా వ్యాక్సిన్, 60 ఏళ్ల పైబడిన 43% మందికి కొవిషీల్డ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరిన వారిలో 20% మంది ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నవారే ఉన్నారు. రెండింటికీ వైరస్‌పై 100% ప్రభావశీలత లేదు. కొవిషీల్డ్‌కి 76%, చైనా వ్యాక్సిన్‌ సైనోఫామ్‌కి 79% మాత్రమే ఉంది. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని, వారిలో లక్షణాలు కనిపించకపోయినా వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి సంక్రమింప చేస్తారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొందరు వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ వాటికున్న 80%లోపు సమర్థత కారణంగా వైరస్‌కులోను కావొచ్చంటున్నారు. అందువల్ల వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్తగా ఉండాలన్నది సీషెల్స్‌ చెబుతున్న గుణపాఠం.

సీషెల్స్‌ అనుభవాలను ప్రపంచ దేశాలు ఉదాహరణగా తీసుకొని మసలుకోవాలి. అత్యధికమందికి వ్యాక్సిన్‌ వేసినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్‌ఫెక్షన్‌ను ఆపడం సాధ్యం కాదు. అవి ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించినప్పటికీ పూర్తి రక్షణ ఇవ్వలేవన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ వైరస్‌లలో వస్తున్న ఉత్పరివర్తనాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలి. మనం ఎంతగా వ్యాక్సిన్ల కోసం పరుగులు తీసినప్పటికీ భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం, తాజా గాలిలాంటి వాటిని మరిచి పోకూడదు. అవే వైరస్‌ సంక్రమణాన్ని బలంగా నిరోధిస్తాయి.-వైద్య నిపుణుల హెచ్చరిక 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని