
తాజా వార్తలు
ఫైజర్ టీకా రవాణాకు అనుమతి
న్యూయార్క్: అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు రాగానే ఫైజర్ టీకాను తక్కువ సమయంలో రవాణా చేసేందుకు అమెరికా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అనుమతులు సంపాదించింది. టీకాలను మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ(ఎఫ్ఏఏ ) అనుమతితో పెద్ద మొత్తంలో పొడి ఐస్‌ను విమానాల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబరు 10న టీకాను ఎఫ్‌డీఏ అనుమతి కోసం పంపనున్నారు. టీకాకు పచ్చజెండా రాగానే ప్రపంచవ్యాప్తంగా ఫైజర్టీకాను పంపిణీ చేసేందుకు అమెరికా సర్వం సిద్ధం చేసింది. టీకాలను రవాణాకు అనుకూలంగా ఉండేందుకు చిన్నసైజు సూట్‌కేసుల వంటి వాటిలో పెట్టనున్నారు. దీని కోసం పెద్ద మొత్తంలో కార్గో విమానాలను వినియోగించనున్నట్లు వారు తెలిపారు. బ్రసెల్స్, చికాగో అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమానాలను నడిపేందుకు ఇప్పటికే ఎఫ్ఏఏ అనుమతి తీసుకున్నారు. అమెరికా సుమారు 6.4మిలియన్ల డోసులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాక్సిన్ అనుమతులు పూర్తయిన తర్వాత వీలైనంత త్వరలో వాటి పంపిణీ పూర్తి చేయాలని అమెరికా యోచిస్తోంది.