తూ.గో.లో కౌలురైతుల పేరుతో భారీ మోసం
close

తాజా వార్తలు

Published : 03/01/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తూ.గో.లో కౌలురైతుల పేరుతో భారీ మోసం

అంబాజీపేట: తూర్పు గోదావరి జిల్లా అంజాజీపేటలో రైతుల పేరుతో భారీ మోసం జరిగింది. రైతులకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. భూములపై అప్పటికే రుణాలున్నా.. బ్యాంకు అధికారులు అదనంగా మరిన్ని రుణాలు మంజూరు చేశారు. విషయం తెలిసిన భూముల యజమానులు విస్మయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన కొలిశెట్టి శ్రీరాములుకు 0.97 ఎకరాల్లో కొబ్బరితోట ఉంది. దీనిపై రైతు ఎలాంటి రుణాలు‌ తీసుకోలేదు. ఇటీవల కుమార్తె వివాహం‌ నిమిత్తం డబ్బు అవసరమై రుణం కోసం స్థానిక బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో అప్పటికే రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై రైతు మీసేవకు వెళ్లి పరిశీలించగా.. అంబాజీపేట మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన కుడిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కౌలు రైతు కార్డుతో స్థానిక ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు) బ్రాంచిలో రూ.99,000 రుణం పొందినట్లు తెలియడంతో శ్రీరాములు అవాక్కయ్యాడు. ఈ విషయంపై బ్యాంకు అధికారిని సంప్రదించగా రైతుకు పొంతనలేని సమాధానం చెప్పడంతో రుణం పొందిన వ్యక్తిని శ్రీరాములు నిలదీశాడు. విషయం బయటకు పొక్కడంతో ఆ వ్యక్తి కంగారుగా రుణాన్ని మొత్తం చెల్లించేశాడు. అదే విషయమై బాధితుడు మరింత లోతుగా పరిశీలించగా అదే సర్వే నంబరులో బాధితుడి చిన్నమ్మ కొలిశెట్టి నాగవెంకట లక్ష్మికి‌ చెందిన మూడు ఎకరాల కొబ్బరి తోటపై కూడా అదే బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఆమెకు తెలియకుండానే అంబాజీపేట యూనియన్ బ్యాంక్‌లో 12 జూలై 2019న బొక్కా వెంకటమాధవి పేరిట రూ.99,000 రుణం ముంజూరు చేసినట్లు గుర్తించారు.

పూర్తి స్థాయిలో విచారిస్తాం: బ్యాంక్‌ మేనేజర్‌

‘‘కౌలురైతు కార్డుల ఆధారంగానే రుణాలు మంజూరు చేశాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కౌలు రైతులందరికీ రుణాలు ఇవ్వాలి. అంబాజీపేట తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వారు కౌలురైతు కార్డులు పొందారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం’’ అని యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పృథ్వీనాథ్‌ తెలిపారు.

అయితే తమకు తెలియకుండానే కౌలురైతుల పేరుతో ఇతరులు రుణాలు తీసుకోవడంతో భూమి యజమానులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. తాము ఎప్పుడూ ఎవరికీ తమ‌ భూములను కౌలుకు ఇవ్వక‌పోయినా రెవెన్యూ అధికారులు కౌలు రైతు‌ కార్డులు ఎలా మంజూరు చేశారనేది అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. కౌలురైతు కార్డుపై ఎకరాకు రూ.35వేలకు మించి రుణం ఇచ్చే అవకాశం లేకపోయినా లక్షలాది రూపాయల రుణాలు బ్యాంకు అధికారులు ఎలా మంజూరు చేశారో తేలాల్సి ఉంది.

ఇవీ చదవండి..

యూపీ: పైకప్పు కూలి 18 మంది మృతి!

పాక్‌లో దేవాలయంపై దాడి.. 45 మంది అరెస్టు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని