close

తాజా వార్తలు

Published : 13/01/2020 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గేట్‌ దాటే వేళ...

మార్కులను పెంచే మెలకువలు

ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు అఖిలభారత స్థాయిలో నిర్వహించే పరీక్ష- గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌). నాణ్యమైన సాంకేతిక విద్యకే కాకుండా అంతర్జాతీయంగా అత్యుత్తమ సంస్థల్లో కొలువులకీ ఈ స్కోరు తోడ్పడుతుంది. దీనికి దాదాపుగా 2-3 వారాల వ్యవధి మాత్రమే ఉంది. ఇంతవరకూ సాగించిన సన్నద్ధతకు తుది మెరుగులు దిద్దుకొని, కొన్ని మెలకువలు పాటిస్తే అదనపు మార్కులు తెచ్చుకోవచ్చు; ర్యాంకును మరింత మెరుగుపరుచుకోవచ్చు!

ఐఐటీలు, ఐఐఎస్‌సీ- బెంగళూరు, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి గేట్‌ స్కోరు తప్పనిసరి. ప్రవేశంతోపాటు నెలవారీ రూ.12,400 ఉపకారవేతనమూ అందుకోవచ్ఛు మహారత్న, మినీరత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాన్ని పొందడానికీ గేట్‌ స్కోరు సాయపడుతుంది.

ఉదయం, మధ్యాహ్నం.. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఫిబ్రవరి 1, 2; 8, 9 తేదీల్లో గేట్‌ను నిర్వహించనున్నారు. గేట్‌ హాల్‌ టికెట్లను పోస్టు ద్వారా పంపరు. సంబంధిత జోనల్‌ గేట్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు స్వయంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సివుంటుంది.

సమగ్ర అభ్యాసం

ఉన్న సమయం చాలా తక్కువ. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల సాధన అవసరం. ప్రతిరోజూ 2 లేదా 3 సబ్జెక్టుల నుంచి ముఖ్యమైన ఫార్ములాలను అభ్యసించి, వాటిని పాయింట్ల రూపంలో నోట్సు తయారు చేసుకోవాలి. ఇది పరీక్ష ముందురోజు త్వరిత పునశ్చరణకు ఉపయోగపడుతుంది. ప్రతి ఫార్ములాకు సంబంధించి ఒకటి లేదా రెండు న్యూమరికల్‌ ప్రశ్నలను అభ్యాసం చేయాలి. ఈ సమయంలో క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి మననం చేసుకోవాలి. ఇప్పటివరకూ చదవని, కఠినమైన కొత్త విషయాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. పరీక్షలోపు ఉన్న కాలాన్ని పునశ్చరణ సమయంగా పరిగణించాలి.

సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలు సాధనలో నాణ్యతను తెలుసుకోడానికి సాయపడతాయి. దీనివల్ల సమగ్ర అవగాహన లేని విషయాలను పునశ్చరణ చేసుకోవచ్ఛు గత ప్రశ్నపత్రాల నుంచి దాదాపు 25% ప్రశ్నలు పునరావృతమవుతుంటాయి. కాబట్టి, వీలైనన్నింటిని సాధన చేయాలి.

75% ప్రశ్నలు సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉంటాయి. వీటికోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గతంలో ఎప్పుడూ అడగని అంశాలు (అన్‌టాప్‌డ్‌ ఏరియాస్‌)పైనా తగిన దృష్టిపెట్టాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నలు చాలావరకూ గేట్‌లో అడుగుతుంటారు. కాబట్టి వీటినీ గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి.

కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారమివ్వరు. తార్కికంగా ఆలోచించి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. ఇవి ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి.

కఠినమనే ఆందోళన వద్దు

నమూనా పరీక్షలు రాస్తున్నపుడే తగిన మెలకువలు అలవాటు చేసుకోవాలి. పరీక్షలో కఠిన ప్రశ్నలను చూసి ఆందోళన పడొద్ధు మొత్తం పేపర్‌ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు అనవసరం. గేట్‌ స్కోరు సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్ధు గత గేట్‌ పరీక్షలను పరిశీలిస్తే కొన్ని విభాగాల్లో 100కు 65 నుంచి 75 మార్కులు సాధించినవారికి కూడా ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. మంచి సంస్థల్లో ప్రవేశం పొందారు.

న్యూమరికల్‌ ప్రశ్నలను అశ్రద్ధ చేయకూడదు. యూనిట్స్‌తో చిక్కు వస్తుంది. యూనిట్ల కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. న్యూమరికల్‌ ప్రశ్నలు చేసేప్పుడు రఫ్‌ పేపర్‌పై తగిన రీతిలో స్టెప్స్‌ రాసుకోవాలి. ఒకవేళ సమాధానం రాని పక్షంలో వీటిని మరోసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది.

సాధనలో చేసే తప్పులివే

చాలామంది ఈ సమయంలో తమ సన్నద్ధతను పక్కనపెట్టి, కఠినమైన ప్రశ్నలను సాధన చేసే క్రమంలో నూతన అంశాల సాధనలో పడతారు. ఈ సమయంలో ఈ ధోరణి మంచిది కాదు.

పూర్వం సాధన చేసిన అంశాలన్నీ గుర్తుంటాయనే భావనతో రివిజన్‌ను విస్మరిస్తారు. అది సరికాదు.

సులభంగా అనిపించినవాటినే పునశ్చరణ చేయటం సరైన వ్యూహం కాదు. కఠినమైనవాటినీ పునశ్చరణ చేయాలి.

పునశ్చరణ ప్రధానం

సాధనను త్వరగా పూర్తిచేసి వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేసేలా చూసుకోవాలి.

సబ్జెక్టుల వెయిటేజీ ఆధారంగా ముఖ్యమైన ఫార్ములాలు, కీలకాంశాలను ఈ సమయంలో సాధన చేయాలి.

పరీక్ష దగ్గర పడే సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకూడదు. సాధన సమయంలో ఎదురైన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి.

పాఠ్యపుస్తకాల్లోని సాల్వ్‌డ్‌, అన్‌సాల్వ్‌డ్‌ ప్రశ్నలను సాధన చేయాలి.

వీలైనన్ని ఎక్కువ ఆన్‌లైన్‌ పరీక్షలు రాయాలి. వీటిలో చేసిన తప్పులను గుర్తించి, పునరావృతం కాకుండా చూసుకోవాలి.

బృందాలుగా ఏర్పడి చదివి, ఒకరికొకరు చర్చించుకుంటూ చదివితే సందేహాల నివృత్తి సాధ్యమవుతుంది. కొత్త అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. సమయమూ వృథా కాదు.

రుణాత్మక మార్కులున్నాయ్‌

పరీక్షలో రుణాత్మక మార్కులున్నందున కచ్చితంగా తెలిసిన సమాధానాలనే రాయాలి. అంచనాతో జవాబులు గుర్తించడం ఒక్కోసారి నష్టాన్ని కలిగిస్తుంది. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. అలాగే సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం పట్టే, క్లిష్టమైన ప్రశ్నల వద్ద సమయాన్ని వృథా చేయొద్ధు సులభమైన ప్రశ్నలను గుర్తించి, ముందుగానే పూర్తిచేయాలి.

కొన్ని ప్రశ్నలు తికమక పెట్టేవిగా ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు జవాబులు తెలిసినవైనప్పటికీ ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అదో క్లిష్టమైన ప్రశ్నగా అనిపించవచ్ఛు అలాంటివాటిపై తగినంత జాగ్రత్త వహించాలి!

- ప్రొ. వై.వి. గోపాలకృష్ణమూర్తి


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని