close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 10/03/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నారీశక్తి మంత్రం!

వివిధ రంగాల్లో సేవలందించిన అతివల దీక్షా దక్షతలకు దక్కిన అరుదైన గౌరవం... నారీశక్తి పురస్కారం. కోట్ల మందికి ప్రేరణగా నిలిచిన మహిళలను యావత్‌ నారీలోకం స్మరించుకోవాల్సిన సందర్భమిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఈ పురస్కారం అందజేసి సత్కరించారు రాష్ట్రపతి. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవితో పాటు బినాదేవి, అర్ఫా జాన్‌, చామి ముర్ము, కళావతీ దేవి, కౌశికీ చక్రవర్తి, నిల్జా వాగ్మో, మోహనా జితర్వాల్‌, అవనీ చతుర్వేది, భావనా కాంత్‌, మన్‌ కౌర్‌, రష్మి ఉర్ధవర్సే, తషి మాలిక్‌, నంగ్షీ మాలిక్‌, కాత్యాయని అమ్మ కూడా ఉన్నారు.


దేశమా... వారి మాట విందాం!

మీరు చేసిన ఓ మంచిపని కోట్లాదిమందికి చేరొచ్చు... దేశాన్నే కదిలించొచ్చు. ప్రపంచమంతా అభినందనలు పొందొచ్చు... ఈ అవకాశాన్ని సాక్షాత్తూ ప్రధానే కల్పిస్తే?
ప్రధాని నరేంద్రమోదీ తన సామాజిక మాధ్యమాలను ఈ ఏడాది మార్చి 8న మహిళలకు మాత్రమే కేటాయించనున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్ఫూర్తిమంతమైన మహిళలను తమ గురించి చెప్పాలంటూ మోదీ తన సామాజిక మాధ్యమాల్లోకి ఆహ్వానించారు. ప్రజలకు తాము అందిస్తున్న సేవలు, సాధించిన సాధికారతను ఇందులో పొందుపరచొచ్చని తెలిపారు. ఈ క్రమంలో వారి నుంచి ఎంపిక చేసినవారికి మహిళాదినోత్సవం నాడు తన సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగించి గౌరవిస్తానని తెలిపారు. చెప్పినట్లుగానే ఆదివారం ఆయన ఖాతాలను ఏడుగురు మహిళా సాధకులకు అప్పగించారు. ‘ఈ ఏడుగురు మహిళలు తమ మార్గంలో నడుస్తూనే, మరెందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు...’ అంటూ వారిని ప్రశసించారు.  ఇది ఆ ఏడుగురి ప్రస్థానం...

‘మహిళలందరికీ నా అభినందనలు. వారి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతోపాటు వారి సాఫల్యానికి నమస్కరిద్దాం...’

- నరేంద్ర మోదీ


ఆ ఏడుగురూ..

స్నేహ మోహన్‌దాస్‌

ఫుడ్‌బ్యాంక్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతోమంది ఆకలి తీరుస్తున్నారు తమిళనాడుకు చెందిన స్నేహ. ఇతరుల ఆకలి తీర్చాలనుకునేవారు... స్థోమతకు తగ్గట్లు ఎంతో కొంత మందికి వంట చేసి ఫుడ్‌ బ్యాంక్‌ వాలంటీర్లకు సమాచారం అందిస్తే చాలు. వారే భోజనం స్వీకరించి, అవసరమైన వారికి అందిస్తారు. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ వాలంటీర్లు సేవలందిస్తున్నారు.


మాళవిక అయ్యర్‌

తమిళనాడుకు చెందిన మాళవిక... 13ఏళ్ల వయసులో బాంబు దాడికి గురైంది. ఆ దాడిలో ఆమె చేతులు పూర్తిగాకాలిపోయాయి. పద్దెనిమిది నెలల పాటు చికిత్సలు చేసిన తరువాత నడవగలిగింది. వైకల్యాన్ని లెక్కచేయకుండా ఉన్నతవిద్య అభ్యసించి, సోషల్‌ వర్క్‌లో పీజీ, పీహెడీ పూర్తి చేసిన ఈ యువతి దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతోంది.


కల్పనా రమేష్‌

హైదరాబాద్‌కు చెందిన కల్పన.. నీటి వనరుల సంరక్షణపై దృష్టి పెట్టారు. మొదటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఈ ఆర్కిటెక్ట్‌... టెడెక్స్‌ స్పీకర్‌గా స్ఫూర్తివంతమైన ప్రసంగాలిస్తుంటారు. అపార్ట్‌మెంట్లలో ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి వినియోగం వంటి అంశాలపై నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. ‘భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించాలంటే ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటి పొదుపు చేయడానికి అందరం కలసికట్టుగా పనిచేయాలి’ అని చెబుతూ ప్రజలను చైతన్యపరుస్తుందీమె.


అరిఫా జాన్‌

శ్రీనగర్‌కు చెందిన అరిఫా జాన్‌ నుంధా హస్తకళ ద్వారా కనుమరుగవుతున్న కళల పునరుజ్జీవనానికి కృషి చేస్తోంది. ఈ దిశగా వందమందికి పైగా మహిళలకు శిక్షణనిచ్చింది. ఈ పనిచేసే కార్మికుల వేతనాన్ని గణనీయంగా పెంచింది. మహిళా వ్యాపారవేత్తగా సంప్రదాయవాదుల విమర్శలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. నుంధా కళలో సరికొత్త డిజైన్లను సృష్టించింది.


కళావతీ దేవి

కాన్పూర్‌ చుట్టుపక్కల గ్రామాల్లో నాలుగువేల మూత్రశాలలను నిర్మించింది కళావతీ దేవి. బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనారోగ్యాల గురించి ఇంటింటికీ వెళ్లి గ్రామ ప్రజలకు వివరించింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లూ ఇంటి ఆవరణలోనే మూత్రశాలలను నిర్మించుకునేలా చేసింది. ఈమె ఆదాయం మీదే కుటుంబమంతా ఆధారపడినా తన ఆశయాన్ని మాత్రం వీడలేదు. అనుకోకుండా అల్లుడు చనిపోవడంతో కూతురు, ఇద్దరు మనుమరాళ్ల పోషణ బాధ్యత ఈమె మీద పడినా దాన్ని భారంగా పరిగణించలేదు. ప్రజల్లో స్ఫూర్తిని నింపడంలో వెనుకంజ వేయలేదు.


బీనాదేవి

బిహార్‌లోని ముంగర్‌కు చెందిన బీనాదేవిని ‘మష్రూమ్‌ మహిళ’ అంటారు. మహిళలకు సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగులను పండించడం, మేకల పెంపకంలో శిక్షణనిచ్చింది. వంద గ్రామాల్లోని సుమారు పదిహేను వందల మంది మహిళలను పుట్ట గొడుగుల రైతులుగా తీర్చిదిద్దింది. మొబైల్‌ ఫోన్ల వినియోగంలోనూ ఏడువందల మంది మహిళా రైతులకు శిక్షణనిచ్చింది. వ్యవసాయం ద్వారా మహిళా సాధికారతకు కృషిచేసింది.


విజయపవార్‌

మహారాష్ట్రకు చెందిన విజయపవార్‌, స్థానిక బంజారా హస్తకళను దేశవ్యాప్తంగా విస్తరించేలా కృషి చేస్తోంది. స్థానిక మహిళలకు ఉపాధిని కల్పించేందుకు సంప్రదాయ కుట్లు, అల్లికల గురించి అధ్యయనం చేసింది. 2004లో ఓ సామాజిక సేవాసంస్థను స్థాపించింది. ఈ కళను అభివృద్ధి చేసేదిశగా అంబేడ్కర్‌ హస్తశిల్పి యోజన పథకం ద్వారా కేంద్రప్రభుత్వ సహకారాన్నీ అందుకుంది. ఇందులో భాగంగా అయిదేళ్లపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణాతరగతుల ద్వారా దాదాపు 600మందికి పైగా గ్రామీణ
మహిళలు లబ్ది పొందారు. రెండు దశాబ్దాలుగా వేలాదిమంది మహిళలకు ఉపాధి అందేలా విజయపవార్‌ కృషి చేసింది. కేంద్రప్రభుత్వం అందించే చేయూతతో మారుమూల గ్రామీణమహిళలూ సాధికారత సాధిస్తున్నారనే దానికి నిదర్శనంగా నిలుస్తూ... విజయం సాధిస్తోందీమె.


ఆమె గిరిజనుల చిరునవ్వు!

గిరిజనులు...  అందునా మహిళలు... వాళ్లేం సాధిస్తారు? ఇదిగో సమాధానం నేను చెప్తానంటూ ముందుకొచ్చారామె. కొండపోడులో కొత్త విధానాలతో అక్షరాలా అద్భుతమే చేశారు. గిరిజన మహిళలకు ఆరోగ్యంతో పాటు సౌభాగ్యాన్నీ అందించారు.
ఒకనాటి మాట...
సిక్కోలు జిల్లా హిరామండలం, సీతంపేట ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన ప్రాంతాలు... ఎక్కడ చూసినా కొండపోడు భూములుండేవి. వాటి నిండా చిరుధాన్యాల పంటలుండేవి. ఆ రోజుల్లో అక్కడ రకరకాల వ్యాపారాలుండేవి కాదు. ఇచ్చిపుచ్చుకునే విధానంలో సామగ్రి తీసుకుని ఆ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ జీవితాన్ని గడిపేసేవారు.

పడాల భూదేవికి కేంద్ర ప్రభుత్వం అందించే నారీశక్తి పురస్కారం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆదివారం అవార్డు అందుకున్నారు. బాలింతలు, గర్భిణులకు మన్యంలో పండే చిరుధాన్యాలతో తయారైన పోషకాహారం అందించేలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
కాలం మారింది...
ఆరోగ్యంకన్నా ఆదాయం ప్రథమ ప్రాధాన్యంగా మారింది. చిరుధాన్యాల స్థానంలో వాణిజ్య పంటలు వచ్చిచేరాయి. పోడుతో పాటు, ఇతర సాగు భూముల్లో జీడి మామిడి, ఉద్యాన పంటలు వచ్చిచేరాయి. క్రమంగా గిరిజనుల ఆహారపుటలవాట్లూ మారాయి. తినే ఆహారంతో పాటు అక్కడి ప్రజల ఆరోగ్యంలోనూ తేడాలొచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని బాలింతలు, గర్భిణులు రక్తహీనతకు ఎక్కువగా గురయ్యేవారు. ఈ విషయం మన్యంవాసే అయిన భూదేవిని ఆలోచనలో పడేసింది. కష్టజీవులైన గిరిపుత్రులకు మంచి ఆహారం అవసరం. అత్యధిక పోషకాలున్న చిరుధాన్యాలను వదిలేస్తే వారికి కొండలను పిండిచేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే గిరిజన ప్రాంతాల్లో తిరిగి చిరుధాన్యాలను ప్రోత్సహించాలి. అలా చేయమంటే వాణిజ్య పంటలతో నాలుగు రూపాయలు కళ్లజూస్తున్న గిరిజనులు అంగీకరించరు. అందుకే ఉభయతారకంగా ఉండేలా ఆలోచన చేశారు భూదేవి. చిన్నయ్య ఆదివాసీ వికాస సంఘం పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. 2016లో చిరుధాన్యాల పునరుజ్జీవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సహకారంతో తన ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ ద్వారా శతశాతం రాయితీతో విత్తనాలను సరఫరా చేయించారు. గిరిజనులకు నచ్చజెప్పి వారి భూముల్లో చిరుధాన్యాలు వేసేలా ప్రోత్సహించారు. వాణిజ్య పంటలైతే దళారులే వచ్చి తీసుకెళతారు. ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది... కదా. దానికీ పరిష్కారం కనుక్కున్నారు భూదేవి. ఆదివాసీ వికాస సంఘం ఆధ్వర్యంలో పండిన పంటను కొనుగోలు చేసి పొడి, బిస్కెట్లు, వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయించి మార్కెటింగ్‌ చేయడం ప్రారంభించారు. ఈ తయారీ అంతా గిరిజన మహిళల చేతులమీదుగానే జరిగేది. రైతులకు మంచి ధర కూడా దక్కేది. సంస్థలో పనిచేసే మహిళలు మంచి ఆదాయాన్నీ పొందగలిగారు. దీంతో వారి ఆర్థిక స్థాయి క్రమంగా మారడం ప్రారంభమైంది. ప్రస్తుతం సీతంపేట, కొత్తూరు, హిరమండలం, వీరఘట్టం మండలాల్లో సుమారు 4వేల ఎకరాల్లో సుమారు 3వేల మంది గిరిజన రైతులు ప్రస్తుతం చిరుధాన్యల సాగులో ఉన్నారు. ఈ క్రమంలో నాబార్డు సహకారం కూడా ఉందని చెబుతారు భూదేవి. ‘చిరుధాన్యాలతో అప్పడాలు, వడియాలు తయారు చేస్తున్నాం... కళానికేతన్‌, సీఎంఆర్‌ వంటి పేరొందిన వస్త్రదుకాణాల నిర్వాహకులు అందజేసే ముడి సరకుతో వివిధ రకాల వస్త్రాలు, దుస్తులు తయారు చేసి అందించే కార్యక్రమానికి త్వరలో శ్రీకారంచుడుతున్నా’మని చెబుతున్నారామె.

- బరాటం ఈశ్వరరావు, సీతంపేట


వనదేవతకు వందనం


ఛామీదేవీ ముర్ము

ఝార్ఖండ్‌కు చెందిన ఛామీదేవీ ముర్ము ‘లేడీ టార్జన్‌’గా పేరొందారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా తన బృందంతో కలిసి పోరాడుతున్నారు. కలప, గృహనిర్మాణానికి ఉపయోగపడే మొక్కలను నాటుతున్నారు.  ఇప్పటివరకూ ఇరవైఅయిదు లక్షల మొక్కలు నాటారీమె.


పరుగు ఆపలేదు..

సర్దార్ని మన్‌కౌర్‌

‘గోల్టెన్‌ సెంచురియన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’ గా పేరొందిన 104 ఏళ్ల మన్‌కౌర్‌ స్వస్థలం పంజాబ్‌. 93 ఏళ్ల లేటు వయసులో అథ్లెట్‌గా మారిన మన్‌కౌర్‌ భారతదేశం తరఫున అమెరికాలో జరిగిన ద వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, రెండు స్వర్ణపతకాలను సాధించారు. లక్ష్యాన్ని సాధించడంలో ఈమె చేస్తున్న కృషి నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.


ఆకాశమే హద్దుగా...

యుద్ధ కార్యకలాపాలను నిర్వహించడంలో తొలి మహిళా ఫ్లైట్‌ లెఫ్టినెంట్స్‌ బృందంగా అవనీచతుర్వేది, భావనాకాంత్‌, మోహనాసింగ్‌ చరిత్రలో నిలిచారు. కఠిన శిక్షణతో మిగ్‌ - 21 బైసన్‌ విమానంపై ఆపరేషన్స్‌ చేపట్టడానికి వీరు అర్హత సాధించారు. భారతవైమానిక దళం (ఐఏఎఫ్‌)లో తొలి మహిళా ఫ్లైట్‌ లెఫ్టినెంట్స్‌గా స్థానాన్ని పొందారు. ‘మహిళాశక్తి’గా నిలిచిన ఈ ముగ్గురూ ఎందరికో స్ఫూర్తిగా మారారు.


వాహ్‌... అనేలా!

రష్మి ఉర్ధవర్సే

నాగ్‌పూర్‌కు చెందిన రష్మి పుణెలో ఎలక్ట్రానిక్స్‌ యింజినీర్‌గా పట్టా తీసుకున్నారు. ఆటోమోటివ్‌ రీసెర్చి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ)లో ట్రైనీ యింజినీర్‌గా చేరి, తన ప్రతిభ, సామర్థ్యం, కృషితో ఆ సంస్థకే డైరెక్టరుగా ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నారు. ఆటోమోటివ్‌ ఇండస్ట్రీస్‌ రంగంలో మహిళలూ విజయాలు సాధించగలరని నిరూపించారీమె.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.