
తాజా వార్తలు
ఇళ్లు-ఫ్లాట్లు వాస్తవ ధరకు అమ్మండి
వడ్డీ ఆదా అవుతుంది
స్థిరాస్తి సంస్థలకు మంత్రి గడ్కరీ సలహా
దిల్లీ: ఇళ్లు-ఫ్లాట్లను లాభం ఆశించకుండా అమ్మేసుకోవాలని స్థిరాస్తి సంస్థలకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సలహా ఇచ్చారు. తద్వారా నగదు లభ్యత పెంచుకోవడమే కాకుండా, రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ ఆదా అవుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తితో స్థిరాస్తి రంగం తీవ్రంగా ప్రభావితమైందని, గిరాకీ నెమ్మదించిందని స్థిరాస్తి సమాఖ్య నారెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్లో మంత్రి వెల్లడించారు. నిర్మాణదారులు తమ ప్రతినిధుల్ని గృహ నిర్మాణ, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం వద్దకు పంపి ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు ఇవ్వాల్సిందిగా మంత్రి కోరారు. గృహాలకు గిరాకీ పెంచేందుకు నిర్మాణదారులకు కొన్ని సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారాల్ని విస్తరించడమే కాకుండా రహదారుల నిర్మాణం వంటి భిన్న ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. సొంతంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్థాపించుకోవాలని సూచించి, వాహన పరిశ్రమను ఓ ఉదాహరణగా చూపించారు. ఈక్విటీ చొప్పించడం ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు) అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు వ్యక్తులు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక గృహ రుణాల్ని తక్కువ వడ్డీ రేటుకు అందిస్తే, ఈఎమ్ఐలు తక్కువగా ఉండటంతో ఖాతాదారులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ముంబయిలో చాలా మంది నిర్మాణదారులు ఇళ్లను అమ్ముకోకపోగా, చదరపు అడుగుకు ధర రూ.35,000-40,000 వస్తుందని ఎదురుచూస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇది మరీ అత్యాశకు పోవడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్మాణదారులు చిన్న పట్టణాల్లో రూ.10 లక్షల్లోపు ధరల్లో ఫ్లాట్లు నిర్మించేందుకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ‘పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా చట్టాల అమలుతో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఇప్పుడు కరోనా వైరస్ రూపంలో మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల’ని నారెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హీరానందానీ మంత్రికి విన్నవించారు.