ఆపకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతా..!
close

తాజా వార్తలు

Published : 02/06/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆపకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతా..!

అల్లర్ల నేపథ్యంలో గవర్నర్లకు ట్రంప్‌ ఘాటు హెచ్చరిక

వాషింగ్టన్‌: నల్లజాతి అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయినా, ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల మధ్య సోమవారం సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగించారు. అల్లర్లు అదుపు చేయడంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నేషనల్‌ గార్డ్స్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించపోతే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశ శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం అని.. అందుకు తగిన చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించారు.  

ట్రంప్‌ ప్రసంగానికి ముందుకు ఆందోళనకారులు శ్వేతసౌధం ఆవరణలోని పార్క్‌కు చేరుకొని శాంతియుతంగా నిరసనకు దిగారు. కానీ, అధ్యక్షుడి ప్రసంగం నేపథ్యంలో వారందరినీ అక్కడి నుంచి చెదరగొట్టేందుకు పోలీసులు వారిపైకి భాష్పవాయువు ప్రయోగించారు. అంతకుముందు ట్రంప్‌ ..రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్లు బలహీనంగా ఉండడం వల్లే నిరసనలు ఈ స్థాయికి చేరాయని ఆరోపించారు. వీలైనంత త్వరగా నేషనల్‌ గార్డ్స్‌ని రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేయాలన్నారు. ‘‘మీరు వారిని వెంబడించండి. అరెస్టు చేయండి. పదేళ్లపాటు జైల్లో పెట్టండి. అప్పుడు ఇలాంటి ఘటనలు మరోసారి జరగవు. వాషింగ్టన్‌ డీసీలో మేం అదే చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రజలు చూడని చర్యలు తీసుకోబోతున్నాం’’ అని ఆగ్రహంగా మాట్లాడారు. 

ఇదే సమావేశంలో పాల్గొన్న అటార్నీ జనరల్‌ బిల్‌ బార్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక భద్రతాబలగాలు ఆందోళనలను అదుపు చేయడానికి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆందోళనలకు కారణమవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దని హితవు పలికారు. దాదాపు 15 రాష్ట్రాల్లో ఇప్పటికే నేషనల్‌ గార్డ్స్‌ రంగంలోకి దిగి అల్లర్లను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

ఇదీ చదవండి..

బంకర్లోకి ట్రంప్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని