రాంగ్‌ కాల్‌ వచ్చింది.. నిండా ముంచింది
close

తాజా వార్తలు

Published : 29/08/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాంగ్‌ కాల్‌ వచ్చింది.. నిండా ముంచింది

బెలగాం: అతనెవరో వీరికి తెలియదు.. వీరెవరో అతనికి తెలియదు.. ఎనిమిది నెలల కిందట వచ్చిన ఓ రాంగ్‌ కాల్‌ ఇద్దరినీ కలిపింది. ఆ క్రమంలో సాగిన పరిచయాలు ఇద్దరు మహిళలను కుటుంబానికి దూరం చేశాయి. ఇంటినుంచి వెళ్లిపోయేలా చేశాయి. ఇటీవల ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఇద్దరు మహిళలు, ఓ బాలుడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. చివరకు వీరు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఎస్‌ఐలు కళాధర్‌, జయంతి విలేకర్లకు వివరించారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధికి చెందిన ఓ వివాహిత తన నాలుగేళ్ల కుమారుడు, చెల్లి(ఈమె మైనరు)ని తీసుకుని ఈనెల 10న ఇంటినుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్‌ఐ జయంతి, గ్రామీణ ఎస్‌ఐ వీరబాబు దర్యాప్తు చేపట్టారు. సదరు వివాహితకు ధర్మవరం పట్టణానికి చెందిన అపరిచిత జి.హర్షవర్దన్‌ నుంచి రాంగ్‌ కాల్‌ వచ్చింది. అప్పటినుంచి తరచూ చరవాణిలో మాట్లాడుకుంటూ పరిచయాలను పెంచుకున్నారు. ఈ క్రమంలో అతని సూచన మేరకు ఈనెల 10న తన చెల్లిని, కుమారుడిని తీసుకుని వివాహిత అనంతపురం బయలుదేరి వెళ్లింది. అక్కడి నుంచి బెంగళూరులో ఓ ఇంటిని తీసుకుని ఉంచాడు. వీరి వివరాలను ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఎక్కడ ఉన్నదీ పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఉన్న హర్షవర్దన్‌తో పాటు ఇరువురు మహిళలను, బాలుడిని తీసుకుని పార్వతీపురం తీసుకువచ్చారు. తల్లికి అప్పగించారు. హర్షవర్దన్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న వంశీ అనే యువకుడిని, అతని తల్లిపైన కూడా కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ కళాధర్‌ తెలిపారు. ముఖ్యంగా మహిళలు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వివాదాల్లోకి వెళ్లవద్దని ఆయన సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని