
తాజా వార్తలు
బాబోయ్.. ఇదేం విచిత్రం..!
కత్తులతో యువకుల పరుగులు
భయాందోళనకు గురైన స్థానికులు
పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తులు
నెల్లూరు (నేర విభాగం): నగరంలో పలువురు యువకులు కత్తులు చేతపట్టి పరుగులు తీస్తున్నారు.. ఏం జరుగుతుందో, ఏమో తెలియని పరిస్థితి.. దాంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లఘుచిత్రంలో ఓ భాగమని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకెళితే.. శనివారం మధ్యాహ్నం స్థానిక ఎస్2 థియేటరు వద్ద పలువురు యువకులు ఆగ్రహావేశాలతో చేత కత్తులతో పరుగులు తీస్తున్నారు. ఎవరిపైనో దాడి చేసేందుకు వెళ్తున్నట్లు భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నబజారు ఇన్స్పెక్టర్ మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని పరుగులు తీసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకలా చేస్తున్నారని నిలదీయగా.. షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామంటూ సమాధానమిచ్చారు. అనుమతులు సైతం ఉన్నాయని చెప్పడంతో పోలీసులు వారిని వదిలేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అసలు విషయం తెలిసి పోలీసులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.