
తాజా వార్తలు
నిరుద్యోగులకు కేటీఆర్ శుభవార్త
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగభృతి వస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని రేపోమాపో సీఎం కేసీఆర్ ప్రకటించవచ్చన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన టీఆర్వీకేఎస్ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘అంధకారమయం అవుతుంది.. చీకట్లు అలముకుంటాయి.. అనేలా ఉన్న తెలంగాణలో ఇవాళ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశం, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మా రాష్ట్రంలో కరెంట్ పోవట్లేదని ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కరెంటు కోతలు ఉండేవని.. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కోతలుండవని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం’’ అని ఆయన చెప్పారు.
తొలుత విద్యుత్ సమస్యనే పరిష్కరించాం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించకముందు గృహిణి నుంచి మొదలు ఒక పరిశ్రమను నిర్వహించే పారిశ్రామికవేత్తల వరకు విద్యుత్ కష్టాలంటే ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. దీన్ని ఒక సవాల్‌గా తీసుకున్న తెరాస.. అధికారంలోకి రాగానే మొదటగా విద్యుత్ సమస్యనే పరిష్కరించిందని చెప్పారు. ఇదంతా విద్యుత్ కార్మికుల కఠోర శ్రమ వల్లే సాధ్యపడిందని కొనియాడారు. ఇప్పుడు విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సాగుకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందని వెల్లడించారు. తాగునీటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. సాగునీటి కష్టాల పరిష్కారంతో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
‘‘7వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని ఇవాళ 16వేల మెగావాట్లకు పెంచుకున్నాం. రాష్ట్రంలో అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. పర్యావరణ హితంగా ఉండే సోలార్ పవర్ ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకుపోతోంది. దాదాపు 4వేల మెగావాట్లకుపైగా విద్యుత్‌ను సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నాం. అంతేకాకుండా తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. విద్యుత్ రంగానికి సంబంధించి గడిచిన ఆరేళ్లు సువర్ణాక్షరాలతో లిఖించదగింది. విద్యుత్ ఉపకేంద్రాన్ని దిగ్బంధించిన రైతులు తదితర వార్తలు ఒకప్పుడు వినేవాళ్లం. ఇప్పుడు గ్రామాల్లో అలాంటి దురవస్థలు లేవు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మన ప్రభుత్వం. మీరు అడిగిన దానికంటే సీఎం ఎక్కువే చేశారు తప్ప కాదనలేదు. ఆర్టిజన్స్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్ కో, ట్రాన్స్ కో, సింగరేణి ద్వారా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం.
ఇలా అన్ని రంగాల్లో కలిపి 1.31 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో ఒక శిశువు జన్మిస్తే ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్ మొదలు విదేశాలకు వెళ్లి చదువుకునేంతవరకు వివిధ పథకాల రూపంలో అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటోంది. ఇదే వరుసలో త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా వస్తోంది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని గర్వంగా చెబుతున్నా. కొత్త కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు ఇవన్నీ గమనించాలి. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే టీపీసీసీ, టీ భాజపా అధ్యక్ష పదవులు ఏర్పడ్డాయి. ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు తిప్పికొట్టాలి. ఉద్యోగులకు అక్కడక్కడా ఉన్న చిన్నపాటి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు.