సినీ నటుడు రావి కొండలరావు కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 28/07/2020 21:55 IST

సినీ నటుడు రావి కొండలరావు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు (88) కన్నుమూశారు. 600కుపైగా చిత్రాల్లో నటించి, అనేక చిత్రాలకు దర్శకనిర్మాతగా, రచయితగా పని చేసిన ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (28/7/20)న తుదిశ్వాస విడిచిచారు. ఆయన కెరీర్‌లో ‘తేనె మనసులు’, ‘దసరా బుల్లోడు’, ‘రంగూన్ ‌రౌడీ’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘వరకట్నం’, ‘అందాల రాముడు’, ‘రాధా కళ్యాణం’, ‘చంటబ్బాయి’, ‘పెళ్ళిపుస్తకం’, ‘బృందావనం’ ‘భైరవ ద్వీపం’ ‘రాధాగోపాలం’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘కింగ్’‌, ‘ఓయ్’‌, లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన భార్య దివంగత రాధాకుమారి కూడా సినిమా నటే. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు. 

రావి కొండలరావు ఫిబ్రవరి 11, 1932లో జన్మించారు.  1953లో ఓ మలయాళ చిత్రాన్ని తెలుగులోకి అనువదించగా... దానికి స్క్రిప్టు రాయడంతోపాటు, గాత్ర దానం కూడా చేశారు. అలా కొండలరావు సినిమా రంగంలోకి ప్రవేశించారు. సినీ రచయిత డీవీ నరసరాజు సూచనతో... పొన్నలూరి బ్రదర్స్‌ సంస్థ నిర్మించిన ‘శోభ’ (1958) చిత్రానికి కొండలరావు సహాయ దర్శకుడిగా పని చేశారు. అందులో అనుకోకుండా డాకర్ట్‌పాత్రను ధరించి నట జీవితానికి శ్రీకారం చుట్టారు. ముళ్లపూడి రాసిన ‘దాగుడుమూతలు’, ‘ప్రేమించి చూడు’ రావి కొండలరావు నటుడిగా స్థిరపడటానికి దోహదం చేశాయి. ‘పెళ్ళి పుస్తకం’ చిత్రానికి కథను అందించి, స్వర్ణ నంది పురస్కారం పొందారు. ‘బృందావనం’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ వంటి చిత్రాల నిర్మాణ, రచన బాధ్యతలు చూసుకున్నారు. ‘బంగారు పంజరం’లో నటనకుగాను నంది పురస్కారం దక్కించుకున్నారు. 

రావి కొండలరావుకు చిన్నతనం నుంచి నాటకాలంటే సరదా. కథలు రాయడమంటే చాలా ఇష్టం. ఆయన రాసిన తొలి కథ ‘దైవేచ్ఛ’ 1949లో ‘యువ’లో వచ్చింది. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు సంపాదకత్వంలోని ‘బాల’ పత్రికలో కొండలరావు కథలు వెలువడేవి. అదే సమయంలో ఆ పత్రికలో కథలు రాసే ముళ్లపూడి, బొమ్మలు గీసే బాపుతో కొండలరావుకు స్నేహం ఏర్పడింది. సినీ జీవితం తొలినాళ్లలో రావి కొండలరావు ముళ్లపూడి రమణ ఇంట్లోనే ఉండేవారు.  ‘స్వయంవరం’, ‘కుక్కపిల్ల దొరికింది’, ‘నాలుగిళ్ల చావిడి’, ‘పట్టాలు తప్పిన బండి’, ‘ప్రొఫెసర్‌ పరబ్రహ్మం’ లాంటి నాటికలు, నాటకాలూ రాశారు. ఆ తర్వాత 1956లో ‘బంగారు పాప’ పత్రికను మొదలుపెట్టారు. సుకుమార్‌ పేరుతో కొన్ని గీతాలూ రాశారు. అదే సమయంలో నాటక సమాజం నెలకొల్పి పరిషత్తులో నాటకాలు ప్రదర్శించారు. సినిమాల్లో నటిస్తూనే కొండలరావు, పొట్టి ప్రసాద్‌, రాజబాబు, కాకరాల లాంటి వారితో కలసి నాటకాలు వేశారు. ‘హ్యూమరథం’, ‘మాయా బజార్‌’, ‘మల్లీశ్వరి’ (సినిమా నవలలు), ‘రావి కొండలరావు కథలు’, ‘వాహిని’ లాంటి రచనలు చేశారు. ‘విజయచిత్ర’ పత్రిక రూపశిల్పిగా 1966 నుంచి 1993 వరకు వ్యవహరించారు. తన ఆత్మకథను ‘నాగావళి నుంచి మంజీరా’ వరకు పేరిట తీసుకొచ్చారు.

‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరుతో రావి కొండలరావు సినీ సంకలనం రాశారు. అలనాటి సినిమా విశేషాలను ఆ సంకలనంలో అందించేవారు. తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారానికి ఎంపికైంది. అలాగే కళలకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. సినిమాల్లోకి వచ్చే ముందు రావి కొండలరావు ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీల సభ్యుడిగా పని చేశారు.

ఇదీ చదవండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని