
తాజా వార్తలు
TS: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రద్దు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణులైన వారు కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొంటామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మార్కుల మెమోలను జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో పొందొచ్చని మంత్రి తెలిపారు. అయితే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల తర్వాత అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.