close
రహదారి భద్రతకు సరికొత్త చట్టం

ముసాయిదా బిల్లు సిద్ధం
  త్వరలో మంత్రివర్గం ముందుకు

ఈనాడు, హైదరాబాద్‌: రహదారి భద్రతకు నూతన చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించటంతోపాటు భద్రతా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సురక్షిత రహదారి రవాణా చట్టం-2019 పేరుతో సరికొత్త చట్టాన్ని తీసుకురానుంది. రహదారులు-భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా కమిషనరేట్‌ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాలు పెరుగుతుండడంతో అయిదేళ్ల కిందట సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలవగా ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ దేశవ్యాప్తంగా రహదారి భద్రతపై అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. రహదారి భద్రతకు దేశవ్యాప్తంగా ఒక్క కేరళలోనే ప్రత్యేక చట్టం అమలులో ఉంది. అన్ని రాష్ట్రాలూ ప్రత్యేక చట్టాలను రూపొందించాలని ఆ కమిటీ సూచించింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి ముసాయిదా ప్రతిని రూపొందించింది. రహదారి భద్రతలో భాగస్వాములు(స్టేక్‌ హోల్డర్స్‌)గా ఉన్న రహదారులు-భవనాలు, రవాణా, పోలీసు, వైద్యారోగ్య, విద్య, ఐటీ, న్యాయ, సమాచార పౌరసంబంధాల శాఖల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది.
ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం ఆ ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గం ముందు పెట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆ తరువాత ప్రజాభిప్రాయాన్ని సేకరించిన మీదట వర్షాకాల లేదా శీతాకాల శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది.

రహదారి భద్రతా కమిషనరేట్‌
కొత్త చట్టం అమలుకు రహదారి భద్రత ప్రధాన కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య కమిషనర్‌తోపాటు పలువురు కమిషనర్లను నియమించనుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు రహదారి భద్రతా బృందాలను ఏర్పాటు చేయనుంది. పోలీసు కంట్రోల్‌ రూమ్‌ తరహాలో రహదారి భద్రతా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ముసాయిదా బిల్లులో అధికారులు ప్రతిపాదించారు. ప్రధానకమిషనర్‌, కమిషనర్లను ప్రభుత్వం నియమిస్తుందని పేర్కొన్నప్పటికీ ఏ స్థాయి అధికారులను నియమిస్తారన్నది అందులో లేదు.

రూ. వంద కోట్లతో మూలధన నిధి
రహదారి భద్రతా నిధి(రోడ్డు సేఫ్టీ ఫండ్‌) నిర్వహణకు బోర్డును ఏర్పాటు చేయనుంది. తొలి కార్పస్‌ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లను కేటాయించనుంది. రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేసే అపరాధ రుసుములను వంద శాతం ఈ నిధిలోనే జమ చేస్తారు. రహదారుల నిర్మాణానికి చేస్తున్న ఖర్చులో 0.5 శాతం మొత్తాన్ని నిధికి జమ చేయాలి. నూతన వాహనాల కొనుగోలు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని సెస్సు రూపంలో వసూలు చేసి ఆ నిధికి జమ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు, రుణాలు పొందవచ్చు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.