close
గట్టి పోటీ 5 చోట్లే!

25కు పైగా స్థానాల్లో పెద్ద మొత్తంలో ఓట్ల చీలిక
వచ్చింది 5.35శాతం ఓట్లే
ఒక చోటే గెలుపు, మూడు చోట్ల రెండో స్థానానికి పరిమితం
ఈనాడు - అమరావతి

అయిదంటే... అయిదు
ఏమిటీ అయిదు?
జనసేన గట్టిపోటీ ఇచ్చిన స్థానాలు.
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమవుతామని ముందుకొచ్చిన జనసేన పార్టీ ఎన్నికల్లో ఏమాత్రం బరిలో నిలువలేకపోయింది. ఈ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన స్థానాలు అయిదే కనిపిస్తున్నాయి. అదే సమయంలో 30కి పైగా శాసనసభ స్థానాల్లో జనసేన ప్రభావం వల్ల తెలుగుదేశం నష్టపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెదేపాపై ప్రభావం పడిందని పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో మొత్తం 138 స్థానాల్లో జనసేన తాను పోటీకి నిలబడినట్లు పేర్కొంటోంది. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించి లెక్కలు తీయగా జనసేన పార్టీ పేరుతో 132 స్థానాల్లోనే పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదై ఉంది. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా నామినేషన్‌ దాఖలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని ఇంకొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరించినట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. పరిగణనలోకి తీసుకున్న 132 స్థానాల్లో జనసేన సాధించిన ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో 5.35శాతమే.

ఉత్తరాంధ్రలో మరీ తీసికట్టు
ఉత్తరాంధ్ర జిల్లాలను పరిశీలిస్తే పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాకలోనే 58539 ఓట్లు సాధించారు. ఇది మినహాయిస్తే మరెక్కడా 30 వేల స్థాయికి ఓట్లు తెచ్చుకోలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో 10 వేల ఓట్లు దాటాయంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర సమస్యలను పవన్‌కల్యాణ్‌ విస్తృతంగా వెలుగులోకి తీసుకువచ్చారు. ఉద్దానం ప్రాంతం కూడా జనసేన ఆశించిన స్థాయిలో ఆదుకోలేకపోయిందనే చెప్పవచ్చు. భీమిలి, పెందుర్తి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోనే దాదాపు 20వేలు, అంతకుమించి ఓట్లు తెచ్చుకుంది. భీమిలి, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లోనే దాదాపు 20 వేల వరకు ఓట్ల చీలికకు కారణమయింది.
* మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పోటీ చేసిన తెనాలిలో 29905 ఓట్లు వచ్చాయి. అక్కడ వైకాపా అభ్యర్థి 17649 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
* దక్షిణ కోస్తాలో కావలి, ఒంగోలు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లోనే 10 వేల స్థాయి ఓట్లు రాబట్టుకోగలిగింది. ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్‌, మదనపల్లి, పుంగనూరు వంటి చోట్ల 10 వేల నుంచి 15వేల ఓట్ల మధ్య జనసేన సాధించింది.

నోటా కన్నా తక్కువ
కొన్ని నియోజకవర్గాల్లో జనసేన 4, 5 స్థానాల్లోకి జారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌, నోటాకు వచ్చిన ఓట్ల కన్నా కూడా తక్కువగా జనసేనకు వచ్చాయి. నరసన్నపేటలో జనసేన కన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. చీపురుపల్లిలోనూ అంతే. చీపురుపల్లిలో జనసేన కన్నా నోటాకు ఎక్కువ వచ్చాయి. విశాఖ ఉత్తరంలో భాజపాకు, జనసేనకు దాదాపు దగ్గర దగ్గరగా ఓట్లు వచ్చాయి. మాజీ మంత్రి బాలరాజు పోటీ చేసిన పాడేరులో ఆయన కన్నా స్వతంత్ర అభ్యర్థి కె. కృష్ణారావుకు అత్యధిక ఓట్లు రావడం విశేషం. గిద్దలూరులోనూ జనసేన కన్నా నోటాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి.
* దాదాపు 30 స్థానాల్లో 20 వేలకు అటు, ఇటూగా ఓట్లు చీల్చింది.
* దాదాపు 75 స్థానాల్లో జనసేన అభ్యర్థులకు 10 వేల ఓట్లూ రాకపోవడం గమనార్హం.
* చాలాచోట్ల ఒకటి, రెండు, మూడు శాతం ఓట్లతోనే సరిపెట్టుకొంది.


 

అక్కడే కాస్త నయం

జనసేన ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే గెలుపొందిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (భీమవరం, గాజువాక) రెండో స్థానంలోనే ఆగిపోయారు. భీమవరం, గాజువాక, నరసాపురం(రెండో స్థానం), రాజోలు, అమలాపురం స్థానాల్లో జనసేన కొంత మేర పోటీ ఇవ్వగలిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన చెప్పుకోతగ్గ ఓట్లు సాధించింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.