logo

జనంపైకి ‘రాకాసి చట్టం’

బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది.

Published : 05 May 2024 07:12 IST

కంచే.. చేను మేసేందుకే టైట్లింగ్‌ చట్టం..
వివాదాల భూములన్నీ ఇక పరులపాలే
ప్రైవేటు, దేవాదాయ భూములకు ఎసరు

  • పెనమలూరు మండలం తాడిగడపలో ఓ రైతుకు చెందిన భూమిని తనకు విక్రయించినట్టు ఫోర్జరీ పత్రాలతో ఒక వ్యక్తి దస్తావేజులు సృష్టించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సివిల్‌ కేసు అంటూ నమోదు చేయలేదు సరికదా.. మీ ఇద్దరూ చర్చించుకుని పరిష్కరించుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. కొంతమంది రాజకీయ నాయకులు రంగంలోకి దిగి రాజీ పేరుతో రైతు నుంచి కొంత సొమ్ము గుంజేశారు. ఇది ఇటీవల జరిగిన సంఘటన. అదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వస్తే.. ఆ రైతుకు భూమి దక్కేది కాదు. ఆ ఫోర్జరీ పత్రాలతో అధికారుల అండదండలతో సదరు కబ్జాదారుడే అసలు హక్కుదారుగా అవతరించేవాడు
  • విజయవాడ నడిబొడ్డున ప్రైవేటు వ్యక్తికి, ఓ నాయకుడి మధ్య స్థల వివాదం నడుస్తోంది. సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించినా.. ఆ నాయకుడు తన పలుకుబడితో నగర పాలక అధికారుల అండతో భవనం నిర్మించేశారు. ఈయన్ను ఎదుర్కోడానికి ప్రైవేటు వ్యక్తి శక్తి చాలడం లేదు. అదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కింద అయితే.. దస్తావేజులన్నీ ఆ నాయకుడికే అనుకూలంగా ఉన్నాయంటూ టీఆర్‌వో (టైట్లింగ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి) ఆ స్థలాన్ని ఆయనకే చెందేలా ఇచ్చేసేవారు. దీనిపై మళ్లీ కోర్టుకెళ్లే అవకాశం కూడా లేదు.
  • కవులూరులో దేవస్థానం భూమిని కొంతమంది కౌలుకు ఇస్తున్నారు. దీనిపై పోరాడాల్సిన దేవాదాయ శాఖ మిన్నకుంది. కానీ ఓ ప్రైవేటు వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఇంతలో ఆ స్థలాన్ని జాతీయ రహదారి కోసం తీసుకున్నారు. ఆ పరిహారాన్ని రైతుల పేరుతో ఇచ్చేసేవారే.. కానీ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదులతో ఆగిపోయింది. ఇది ప్రస్తుత పరిస్థితి. అదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్ట ప్రకారమైతే దేవాదాయ శాఖ మౌనంగా ఉంది కాబట్టి.. టీఆర్‌వో ప్రైవేటు వ్యక్తులకు టైటిల్‌ ఇచ్చేస్తారు. రూ.కోట్ల విలువైన భూమి పరులపాలయ్యేది.

ఈనాడు, అమరావతి: బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. సామాన్యుల గొంతు నులిమేస్తూ.. సొంత భూమిపై ఉన్న హక్కులను కాలరాస్తూ.. సర్కారు తీసుకొస్తున్న ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నా.. సర్కారులో చలనమే లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అధికార పక్ష నేతలు, రౌడీలు భూకబ్జాలకు పాల్పడుతున్న ఉదంతాలను చూస్తున్నాం. ఇప్పుడు చట్ట ప్రకారమే అక్రమార్కులకు భూములు కట్టబెట్టేలా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తెస్తోంది. దీనిపై రైతుల ఆందోళనను  పట్టించుకోవటం లేదు.

భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతులకు ఇప్పటికీ భూరికార్డుల సంగతి కొరుకుడు పడదు. అడంగళ్‌, వన్‌బీ, ఆర్‌ఎస్‌ఆర్‌ అంటూ అధికారులు నానా తిప్పలు పెడుతున్నారు. ఎప్పట్నుంచో సాగు చేసుకుంటున్న రైతులు తమ హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. సొమ్ములిస్తేనేగానీ పట్టాదారు పాసుపుస్తకాలివ్వని వైనం అంతటా నెలకొంది. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టం కబ్జాదారులకు, బలవంతులకే రక్షణ కల్పిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న వ్యవస్థలో న్యాయస్థానాల్లో ఆలస్యమైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇకముందు కోర్టులను ఆశ్రయించే అవకాశం లేకుండా వైకాపా సర్కారు జనం హక్కులను కాలరాస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

  • ఉమ్మడి జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు.. భూరక్ష పథకాల పేరుతో ఎన్టీఆర్‌ జిల్లాలో 321 పట్టణ, గ్రామాల్లోనూ, కృష్ణా జిల్లాలో 502 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోనూ రీసర్వే చేస్తున్నారు. ఇప్పటికే కొన్నివేల భూవివాదాలున్నాయి. రీసర్వేలోనూ అనేక లొసుగులున్నాయి. వాస్తవ విస్తీర్ణంకంటే ఎక్కువ, తక్కువలు నమోదు చేసి కొత్త తలనొప్పులు తెస్తున్నారు. రైతులు అడుగుతుంటే.. నీకున్నదింతే అని అధికారులు బుకాయిస్తున్నారు. పైగా జగన్‌ బొమ్మలు ముద్రించిన పుస్తకాలను వారి చేతుల్లో పెడుతున్నారు. సరిహద్దు రాళ్లలోనూ సీఎం జగన్‌ బొమ్మలే.
  • విజయవాడ నగరం, పరిసర గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో వారసత్వహక్కు, మ్యుటేషన్‌ సంబంధిత ఇతర వివాదాలు వేలసంఖ్యలో ఉన్నాయి. ఇవి జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులోనే పరిష్కారం కావటం లేదు. చాలామంది కోర్టులను ఆశ్రయించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు కమీషన్లు దండుకుంటున్నారు.
  • ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్ట ప్రకారమైతే.. తుది నిర్ణయాధికారం టైట్లింగ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్వో)దే. క్రయవిక్రయాలు, మార్టిగేజ్‌ వ్యవహారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. తన సొంత భూమిని యజమాని విక్రయించాలన్నా.. లేదా కుదువ పెట్టాలన్నా.. టీఆర్వో అనుమతి తప్పనిసరి. ఆయనిచ్చిన ధ్రువీకరణపత్రానికే విలువ ఉంటుంది. వివాదాలు రేగితే ఆయన ఇచ్చే టైట్లింగ్‌ కీలకం కానుంది.

ఆ భూములన్నీ హాంఫట్‌..

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే దేవాదాయశాఖ భూములపై ఎన్నో వివాదాలున్నాయి. కొన్ని దేవాలయాల ఈవోలు మినహా మిగిలినవారు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. విజయవాడ శివారు గొల్లపూడిలో ఓ దేవాదాయ భూమి జాతీయ రహదారి కోసం సేకరిస్తే.. అది ప్రైవేటు భూమి అంటూ రూ. 2 కోట్ల పరిహారాన్ని నొక్కేశారు. ఇందులో దేవాదాయ, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఇప్పటికీ ఈ వివాదం తేల్లేదు.

వక్ఫ్‌ బోర్డు భూములు సరేసరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దర్గా భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. దుర్గగుడి భూములు సైతం వివాదంలో ఉన్నాయి. రామలింగేశ్వరనగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం భూముల కబ్జాకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడో భద్రాచలం దేవస్థానం భూములకు నాగాయలంకలో రెక్కలొచ్చాయి. ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని దందాలు చేయడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తోంది. ఇది వస్తే ఆక్రమణదారులకు, రౌడీలకు పండగే. అందుకే రైతులు, ప్రతిపక్షాలు సహా వివిధవర్గాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చీకటి చట్టాన్ని రద్దు చేయాల్సిందే..

అమ్మినేని జ్వాలాప్రసాద్‌, నందిగామ

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజలను గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్‌ చూస్తున్నారు. సాధారణంగా ఇంటి యజమాని మరణిస్తే.. ఆ భూమి ఎవరికి వెళ్తుందో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ల్యాండ్‌ టైట్లింగ్‌ అప్పిలేట్‌ అధికారి చెప్తారట. తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి హక్కుదారులెవరో అధికారులు నిర్ణయించడం సరికాదు. ఈ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఇది ఒక చీకటి చట్టం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని