close
తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే 

తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు 
ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణం 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
కమలదళంలో చేరికపై త్వరలోనే చెబుతానని వెల్లడి

ఈనాడు, నల్గొండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని ఇదే పార్టీకి చెందిన నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని ఆరోపించారు. ఆయన నల్గొండలోని ఓ హోటల్‌లో శనివారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. దేశమంతా భాజపా, ప్రధాని మోదీ వైపు చూస్తోంది. తెలంగాణ ఇచ్చినా నాయకత్వ లోపం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావడం లేదు. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌పై పోరాటం చేయడం కాంగ్రెస్‌ వల్ల కాదని నా అనుమానం. ఇది పార్టీపై చేస్తున్న విమర్శ కాదు. బాధ, అసంతృప్తి, ఆవేదనతో పార్టీ కార్యకర్తల అభిప్రాయమే నేను చెబుతున్నా. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం మార్చకపోవడం వల్లే పార్టీకి ఈ దుస్థితి పట్టింది. గాంధీభవన్లో కూర్చొని తెదేపాతో పొత్తు పెట్టుకొని క్షేత్రస్థాయిలో కార్యకర్తలను గాలికొదిలేశారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ నుంచి గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరినా రాష్ట్ర నాయకత్వం స్పందించలేదు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీయే రాజీనామా చేస్తానని అనగా.. పీసీసీ నాయకత్వం మాత్రం పదవులను పట్టుకొని వేలాడుతోంది. రాహుల్‌ నాయకత్వం బలహీనపడిందని పార్టీ శ్రేణులు, నాయకులు భావిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. భాజపాలో చేరుతున్నారా అని ప్రశ్నించగా.. త్వరలోనే అన్నింటికి సమాధానం చెబుతానన్నారు. ఇటీవల భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిశారా అని అడగ్గా ఇప్పటివరకు తాను ఎవరినీ కలవలేదని జవాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు పీసీసీ పదవి ఇస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ స్థానాలను గెలిపించేవాడినన్నారు. మరో నాలుగున్నరేళ్లు ఎన్నికలు ఉండగా.. ఇప్పుడు పీసీసీని తీసుకొని లాభం ఏంటని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.