
రేపట్నుంచి ప్రారంభం కానున్న ఐచ్ఛికాల ప్రక్రియ
కొలిక్కిరాని ఇంజినీరింగ్ రుసుముల వ్యవహారం
గందరగోళంలో విద్యార్థులు ఐచ్ఛికాల ప్రక్రియ
వాయిదా పడే అవకాశం
ఈనాడు - హైదరాబాద్
ఇంజినీరింగ్ కళాశాలల రుసుములపై స్పష్టత లేకపోవడంతో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఒక రోజే వ్యవధి ఉండటం...ఇప్పటివరకు వచ్చే మూడేళ్లకు రుసుములు ఎంతనేది తేలకపోవడం...కళాశాలలు ప్రతిపాదించిన రుసుములను వసూలు చేసుకోవచ్చని హైకోర్టు పచ్చజెండా ఊపడం...తదితర పరిణామాల నేపథ్యంలో ఐచ్ఛికాల (ఆప్షన్ల) వ్యవహారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయానికి కారణమైంది. ఈ క్రమంలో ఐచ్ఛికాల ప్రక్రియను రెండు మూడు రోజులపాటు వాయిదా పడుతుందని సమాచారం.
ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24వ తేదీ నుంచి మొదలైంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు కళాశాల, బ్రాంచీని ఎంచుకునేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి ఐచ్ఛికాలు(ఆప్షన్లు) ఇచ్చుకోవచ్చని ఎంసెట్ ప్రవేశాల కమిటీ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అంతవరకు బాగానే ఉన్నా ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలంటే ఆ కళాశాలలో వార్షిక రుసుము ఎంతన్నది తెలియడం తప్పనిసరి. ఏడాది నుంచి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ఛైర్మన్ పోస్టు ఖాళీగా ఉండటంతో వచ్చే మూడు సంవత్సరాలకు రుసుములు ఎంతన్నది ఇప్పటివరకు ఖరారు చేయలేదు. దాంతో ఐచ్ఛికాల సమయంలో రుసుములను ఎంతగా చూపించాలన్న విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ఆరు ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా..కళాశాలలు ప్రతిపాదించుకున్న రుసుములను వసూలు చేసుకోవచ్చని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మరో 75 కళాశాలలు కూడా హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని అటు అభ్యర్థులు, ఇటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
షరతు చెప్పి ముందుకా?
హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా..సంబంధిత కళాశాలలకు ప్రభుత్వం గతంలో నిర్ణయించిన రుసుములనే వెబ్సైట్లో చూపుతామని, ఏఎఫ్ఆర్సీ నిర్ణయం ప్రకారమే తుది రుసుము ఉంటుందనే నిబంధనతో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు కొందరు చెబుతున్నారు. హైకోర్టు తమను వసూలు చేసి ఇవ్వమనలేదని, యాజమాన్యాలు వసూలు చేసుకోవచ్చని మాత్రమే చెప్పిందని గుర్తుచేస్తున్నారు. అంటే కళాశాలలో చేరిన తర్వాత విద్యార్థులు అక్కడ చెల్లించాల్సి ఉంటుందని ఒక అధికారి చెప్పారు.
అప్పీల్‌కు వెళ్లే సమయం ఉంటుందా?
ఆరు కళాశాలల రుసుములపై హైకోర్టు తీర్పు వెలువరించి వారం అయినా ఇప్పటివరకు విద్యాశాఖకు తీర్పు ప్రతి అందలేదు. అది బుధవారానికి అందినా..అదే రోజు హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అప్పీల్ చేయకుండా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడితే ఆరోపణలు వెల్లువెత్తుతాయని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించినట్లు సమాచారం. సాయంత్రం మళ్లీ ఆయన విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డిని కలిసి ఇదే విషయమై చర్చించినట్లు తెలిసింది. ఏదేమైనా అప్పీల్‌కు వెళ్లిన తర్వాతనే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఐచ్ఛికాల ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అందుకు అనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియను రెండు మూడు రోజులు వాయిదా వేసినా నష్టం లేదని అభిప్రాయపడుతోంది. మరో వైపు మంగళవారం రాత్రి వరకు కళాశాలలు, కోర్సులు, సీట్లపై శాతవాహన వర్సిటీ మినహా మిగిలినవి సమాచారాన్ని ప్రవేశాల కమిటీకి అందజేయలేదు. దీన్నిబట్టి చూస్తే ఐచ్ఛికాల ప్రక్రియ కొన్ని రోజులు వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి