close

ప్రధానాంశాలు

ఆదివారమూ పది పరీక్ష

జూన్‌ 8 నుంచి జులై 5 వరకు కొనసాగింపు
ఒక్కో పరీక్ష మధ్య 2 రోజుల వ్యవధి

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల కాలపట్టికను విద్యాశాఖ శుక్రవారం ఖరారు చేసింది. జూన్‌ 8 నుంచి జులై 5 వరకు జరిగే పరీక్షల టైంటేబుల్‌ వివరాలను విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. హైకోర్టు సూచనల మేరకు ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. గతానికి భిన్నంగా ఈసారి ఆదివారమూ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధాన సబ్జెక్టు గణితం పేపర్‌-1తో పాటు ఓరియంటల్‌ పేపర్‌-2, ఒకేషనల్‌ కోర్సు థియరీ పరీక్ష ఆదివారమే జరగనుంది.
కాలపట్టికపై శుక్రవారం అధికారులతో చర్చించి, ఆమోదించిన మంత్రి సబిత దాన్ని విడుదలచేశారు. కరోనా కారణంగా ఇప్పటికే పరీక్షల నిర్వహణ రెండు నెలలకు పైగా ఆలస్యం కావడంతో ఆదివారమూ పరీక్ష జరపాలని నిర్ణయించారు.
పరీక్షా కేంద్రాల మార్పును తెలియజేస్తాం: మంత్రి సబిత
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చినట్లుగా విద్యార్థులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలన్నీ తీసుకుంటామని మంత్రి సబిత తెలిపారు. ‘‘భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాం. ప్రస్తుతం ఉన్న 2,530 కేంద్రాలకు అదనంగా మరో 2,005 ఏర్పాటు చేస్తున్నాం’’ అని వివరించారు. గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాలతో పాటు వాటికి అర కిలోమీటరు దూరంలోపే నూతన కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల మార్పును సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రంలోకి గంట ముందే అనుమతిస్తామన్నారు.
విద్యార్థులకు ప్రత్యేక బస్సులు
పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు కావాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుంటే ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తామని చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.