close

తాజా వార్తలు

మా డబ్బు అడుగుతున్నాం.. 

ఆర్బీఐ ఎదుట పీఎంసీ ఖాతాదారుల నిరసన

ముంబయి: సంక్షోభంలో ఉన్న పంజాబ్‌-మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకుకు చెందిన 50 మంది ఖాతాదారులు బుధవారం ముంబయిలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంల ఎదుట నిరసనకు దిగారు. నగదు ఉపసంహరణపై ఆర్బీఐ విధించిన నిబంధనలు సడలించాలని డిమాండ్‌ చేస్తూ ఖాతాదారులు పటేల్‌ చౌక్‌ నుంచి ఆర్బీఐ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసనకు దిగారు. భారీ నిరర్ధక ఆస్తులు ప్రకటించిందన్న కారణంతో పాటుగా అనేక నియంత్రణ లోపాలను ఎత్తిచూపుతూ పీఎంసీ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆరు నెలలపాటు పలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.
పంజాబ్‌-మహారాష్ట్ర సహకార బ్యాంకులో రూ. 4,355 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఆర్బీఐ ఆ బ్యాంకు కార్యకలాపాలపై ఆరు నెలలపాటు పలు నిబంధనలు విధించింది. దీనిలో భాగంగా ఖాతాదారులు మొదటగా రూ.1000 మాత్రమే ఉపసంహరించుకునేలా నిబంధన విధించింది. ఈ విషయంలో ఖాతాదారుల నుంచి విమర్శలు రావడంతో ఈ పరిమితిని రూ. 10 వేలకు పెంచింది. చివరగా ఆరు నెలలకు రూ. 40 వేల వరకు ఉపసంహరించుకునేలా వెసులుబాటు కల్పించింది.
‘మాది శాంతియుత పోరాటం. సమస్యలు పరిష్కరించి మేం చేసిన డిపాజిట్లు వెంటనే వెనక్కి ఇప్పించాలని కోరుతూ ఆర్బీఐ ఉన్నతాధికారి ఒకరికి వినతి ఇచ్చాం. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటికే ముగ్గురు డిపాజిటర్లు ప్రాణాలు కోల్పోయారు. మా పోరాటాన్ని  కొనసాగిస్తాం’ అని పీఎంసీ ఖాతాదారుడు ఒకరు తెలిపారు. ‘ఆరు నెలలకు రూ. 40 వేలకు మించి ఉపసంహరించుకోవడానికి వీల్లేకుండా ఆర్బీఐ నిబంధన విధించింది. ఇలాంటి నిబంధనలతో ఎలా బతికేది. మేం అడుక్కోవడం లేదు. మా డబ్బును మాకివ్వమని అడుగుతున్నాం’ అని మరో ఖాతాదారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.