close

తాజా వార్తలు

అమరావతికి మరణ శాసనం

వరు ఎంతటివారైనా రాజ్యాంగం, చట్టం వారికంటే సర్వోత్కృష్టమైనవని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టీకరించింది. ‘తానిచ్చింది వరం- పెట్టింది శాపం’ అన్న నియంతృత్వ ధోరణితో, చట్టబద్ధంగా సాగుతున్న రాజధాని నిర్మాణ మహాక్రతువును ఏపీలో జగన్‌ సర్కారు ఒక్కపెట్టున కాలదన్నుతున్న వైనం నిశ్చేష్టపరుస్తోంది. అయిదేళ్లు కాదు, వందేళ్ల తప్పిదాల్ని సరిదిద్దాలనుకొంటున్నామంటూ విధానసభలో ఏపీ ప్రభుత్వం సంఖ్యాబలంతో నెగ్గించిన బిల్లు రాష్ట్ర రాజధానిగా అమరావతికి రెక్కలు కత్తిరించింది. ‘అమరావతికి అన్యాయం చేయడం లేదు, తక్కిన ప్రాంతాలకు న్యాయం చేస్తు న్నా’మన్న కపట నాటక మాటకచేరి చట్టసభలో మోతెక్కుతున్నప్పుడే- సీమాంధ్ర కలల రాజధాని నిర్మాణానికి ఏకంగా 34వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా రాసిచ్చిన రైతుకుటుంబాలపై సర్కారు లాఠీ కరాళనృత్యం చేసింది. రాజధానిగా అమరావతికి నాడు విపక్షనేతగా జగన్‌ సైతం సమ్మతించబట్టే తాము భూములిచ్చామన్న రైతాంగం ఆశలకు- వారి దయాధర్మమైన జాగాలో కట్టిన శాసనసభే మరణశాసనం లిఖించింది. అధికారానికి వస్తే అమరావతి సౌభాగ్యాన్ని తుడిచేసి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైకాపా అధినాయకత్వం ఏనాడన్నా చెప్పిందా?- అంటే, లేనేలేదు! దుర్నిరీక్ష్య విజయం సాధించి అధికారం చేపట్టాకే ఆ ఆలోచన పుట్టుకొచ్చిందా?- అంటే, కానేకాదు! వైకాపా చేతికి పాలన పగ్గాలు రాగానే అమరావతిలో విస్తృత స్థాయిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఉన్నట్లుండి ఆగిపోయాయి. అమరావతి ముంపు ప్రాంతమని, అనువుగాని నేలవల్ల అధిక వ్యయం అవుతుందని, ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ ద్వారా అవినీతి జరిగిందని మంత్రుల ముఖతా ఆరోపణలు ముమ్మరించాయి. దక్షిణాఫ్రికా మాదిరిగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానుల ఏర్పాటుపై నవ్య ఆలోచనలు సాగాలన్న ముఖ్యమంత్రి మాటే రాచబాటగా నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు నివేదికలు దూసుకొచ్చాయి. వాటికి హై పవర్‌ కమిటీ ‘మమ’ పలకడంతో- ‘వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి’ పేరిట ముఖ్యమంత్రి అభీష్ట కామ్యార్థ సిద్ధికి రంగం సిద్ధమైంది. మరో మాటలో, అమరావతి భ్రూణ హత్య సర్కారు సారథ్యంలో నిష్ఠగా సాగుతోంది!

ఆరేళ్లనాడు యూపీఏ జమానా సీమాంధ్రుల్ని ఆరళ్లు పెట్టి, రూ.17వేల కోట్ల రెవిన్యూ లోటుతో, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించింది. ‘అత్యాధునికమైన, పర్యావరణపరంగా అత్యున్నతమైన, దేశంలోని రాష్ట్రాల రాజధాని నగరాలతో కాకుండా ప్రపంచంలోని సుందరమైన నగరాలతో పోల్చదగిన, సామాన్యుడికి చేరువగా ఉండే ‘వరల్డ్‌ క్లాస్‌’ రాజధాని నగరాన్ని నిర్మిస్తాం’ అని 2014నాటి మ్యానిఫెస్టోలో వైకాపా ఘనంగా ప్రకటించింది. నిరుటి అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలోనూ- అందరికీ ఉద్యోగావకాశాలు ఉండే విధంగా రాజధానిని ‘ఫ్రీ జోన్‌’గా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసింది. వాటిలో ఎక్కడైనా మూడు రాజధానుల ముచ్చట ఉందా? ‘రాజధాని నిర్మాణం సహా భారీ ప్రాజెక్టులన్నీ ఒకేసారి చేపట్టడంతో భారీస్థాయిలో ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైన మంచి కదలిక వస్తుంది...నిర్మాణరంగంలో కూడా భారీ ‘బూమ్‌’ చోటు చేసుకొంటుంది...ఒక రంగంలో వేగం మిగతా రంగాల అభివృద్ధి వేగాన్ని ఇంతలంతలు చేస్తుంది’ అని 2014లో ప్రకటించిన వైకాపా అధిష్ఠానం, అదేతీరుగా సాగుతున్న అమరావతి నిర్మాణంపై కత్తి ఎందుకు దూసిందో సమాధానం చెప్పాలి! ‘అభివృద్ధి పంపిణీ, పాలన వికేంద్రీకరణల ద్వారా సామాజికార్థిక ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా అందించడా’నికే కదా జిల్లా, తాలూకా, మండల, పంచాయతీ స్థాయుల్లో స్థానిక యంత్రాంగాలు కొలువుతీరింది? వాటికి రాజ్యాంగబద్ధంగా దఖలుపడాల్సిన నిధులు, విధులు, అధికారాలపై దృష్టి సారించకుండా హైకోర్టును కర్నూలుకు, సచివాలయాన్ని విశాఖకు తరలించడమే ప్రాంతీయ అసమానతల అంతంలో తొలి అంకమనే రాజకీయ పైత్య ప్రకోపం- రాష్ట్రాభివృద్ధికి శరాఘాతం!

ఏ రాష్ట్రానికైనా రాజధాని అన్నది శిరోభాగం. ‘మనం ఏమిటన్నది, ఏం కావాలనుకొంటున్నది, మనం ఎటు ప్రస్థానిస్తున్నామన్నదీ మన రాజధాని ప్రతిఫలించాలి’- అన్నది వాషింగ్టన్‌ డీసీ పునర్వికాస చట్టంపై చేవ్రాలు చేస్తూ అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ వెలువరించిన ప్రకటన సారాంశం! సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర వికాసానికి ప్రాతిపదికగా, ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవంలో కీలక పాత్ర పోషించేలా, స్థానిక ప్రజలు సర్కారు పరస్పర సహకారంతో ప్రజా రాజధాని వర్ధిల్లుతుందని 2014 సెప్టెంబరులో చంద్రబాబు ప్రభుత్వం శాసన సభాముఖంగా ప్రకటించింది. ముక్కారు పంటలు పండే 34వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించిన 28వేలమంది రైతుల త్యాగం, 2015 అక్టోబరులో అమరావతి శంకుస్థాపన సందర్భంగా దాదాపు 58 లక్షల ఇటుకల కోసం విరాళాలు పంపిన లక్షలమంది సంకల్పం- ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజా రాజధాని నిర్మాణ స్ఫూర్తిని కళ్లకు కట్టాయి. రాజధానిగా అమరావతి స్వయం సమృద్ధమేనని, రాష్ట్రానికి కామధేనువుగా మారే అవకాశం ఉందన్న అగ్రశ్రేణి సంస్థల నివేదికల్ని అడ్డగోలుగా తోసిపుచ్చి, ఇప్పటికే ఒప్పందాలు ఖరారైన 130 ప్రతిష్ఠాత్మక సంస్థల రాకను డోలాయమానంలో పడేసిన జగన్‌ సర్కారు- రాష్ట్ర భవిష్యత్తునే అక్షరాలా పణం పెడుతోంది. నిర్మాణ రంగంనుంచే ఏటా రూ.12వేల కోట్ల రాబడి రాగల అమరావతికి మద్దతు మొత్తంగా ఎనిమిదేళ్లలో సీఆర్‌డీఏ  కోరింది రూ.12,600 కోట్లు! ఆ సీఆర్‌డీఏకే చెల్లుకొట్టిన ప్రభుత్వం- అదనంగా మరో అయిదేళ్ల కౌలుతో రాజధాని రైతుల్ని సర్దుకోమంటోంది. ప్రజా రాజధానికోసం ప్రాణప్రదమైన భూముల్నే రైతులు రాసిచ్చేయడం కనీవినీ ఎరుగని త్యాగమైతే- వారితోపాటు, రాష్ట్ర భవితనూ బలిపీఠం మీదకు నెడుతూ జగన్‌ సర్కారు చేసింది అక్షరాలా ప్రజాద్రోహం!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.