close

తాజా వార్తలు

జగన్‌ మరో తప్పు చేశారు

తెదేపా, వివిధ సంఘాల నేతలు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: ఇప్పటికే ఎన్నో తప్పులు చేసిన జగన్‌ సీఆర్‌డీఏ రద్దు పేరుతో మరో పెద్ద తప్పు చేశారని తెదేపా, వివిధ సంఘాల నేతలు, న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. సీఆర్‌డీఏ రద్దు న్యాయస్థానాల ముందు నిలబడుతుందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 3 రాజధానుల పేరుతో ఓ నియంత, ఆయన కింద ఉండే 150 మంది బానిసలు దుశ్శాసన పర్వానికి తెరలేపారని మండిపడ్డారు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలోని తుళ్లూరు, వెలగపూడి, మందడంలోని రైతుల దీక్షలకు వివిధ సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 3రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.


రాజధాని ఎందుకు మారుస్తున్నారు

అమరావతిపై కక్షతోనే ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు కుట్ర చేస్తోంది. మద్రాస్‌ ఐఐటీ నివేదిక పేరుతో ప్రభుత్వం తప్పుడు నివేదికను ప్రచారంలోకి తెచ్చింది. సహేతుక కారణం లేకుండానే రాజధానిని మార్చడం ఎంతవరకు సమంజసం?

- గద్దె అనూరాధ, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌



ముఖ్యమంత్రి పీఠంపై దొంగ

ముఖ్యమంత్రి పీఠంపై ఓ దొంగ కూర్చున్నప్పటికీ రాజధాని తీసుకెళ్తున్నారనే ఆవేదనతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చేతులు జోడించి నమస్కరించారు. అయినా జగన్‌ మనసు కరగలేదు. మంత్రులు నారా లోకేశ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఛైర్మన్‌ షరీఫ్‌ను దూషించారు.

- పంచుమర్తి అనూరాధ, తెదేపా అధికార ప్రతినిధి



న్యాయం వైపు నిల్చుంటే బెదిరిస్తున్నారు

ఆర్థిక నేరగాడైన సీఎం జగన్‌ అమరావతి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల ఆమోదం కోసం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ లొంగలేదు. న్యాయం వైపు నిల్చున్న ఆయన్ను బెదిరిస్తున్నారు.

- గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపీ దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌



దోషాలు లేని రాజధాని అమరావతి

రాష్ట్రంలోని 13 జిల్లాల గుండెచప్పుడు అమరావతి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం. అమరావతికి వాస్తుపరంగా ఎలాంటి లోపాలు లేవు. ఇంత మంది  ప్రజల ఉసురు తగలకుండా ఉండాలంటే ప్రభుత్వం రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. రాజధాని తరలింపును అడ్డుకునేందుకు అఖిలపక్షం బలంగా ఉండాలి. భాజపా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. మేం 29 గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం. శ్రీపాశుపత సంపుటీకరణ మహాకాలభైరవ యాగం చివరి రోజున లక్ష మందితో విజయోత్సవ సభను నిర్వహిస్తాం.

- శివస్వామి, శైవక్షేత్ర పీఠాధిపతి



ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి?

రైతులు సీఆర్‌డీఏకి భూములిస్తే దాన్ని రద్దు చేస్తామంటే ఎలా? ఇది న్యాయస్థానం ముందు నిల్చుంటుందా? 3 రాజధానుల పేరుతో ఒక నియంత, ఆయన కింద 150 మంది బానిసలు ఓ దుశ్శాసన పర్వానికి తెరలేపారు. రాజధాని పోతుందన్న ఆవేదనతో 20 మంది రైతులు ప్రాణాలర్పించారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలో అనుకునే తరుణంలో రాజ్యాంగం తన పని తాను చేసింది. హక్కుల కోసం రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారిని ఓడించేందుకు ప్రభుత్వం ఒక న్యాయవాది కోసం రూ.5 కోట్లు చెల్లించడం సిగ్గుమాలిన చర్య.

- శోభారాణి, హైకోర్టు న్యాయవాది



ఇవి ప్రభుత్వ హత్యలే

రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో చనిపోయినవారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సీఎం చేతకానితనం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.12,500 కోట్లు నష్టపోతున్నాం.

- వెంకటేశ్వర్లు, హైకోర్టు న్యాయవాది




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.