corona: లెక్కలేని మరణాలు 15,00,000
close

ప్రధానాంశాలు

corona: లెక్కలేని మరణాలు 15,00,000

ఇవి దేశంలో ఈ ఏడాది సంభవించినవే
ఆంధ్ర సహా 4 రాష్ట్రాల్లోనే 5 లక్షలు
మిగిలిన రాష్ట్రాలవీ లెక్కేస్తే సంఖ్య పెరుగవచ్చు
సమాచారాన్ని దాస్తున్న ప్రభుత్వాలు
మరణాల సంఖ్యను బయటపెడితేనే కొవిడ్‌ మహమ్మారిపై పోరు సులభం
‘ఈనాడు - ఈటీవీ భారత్‌’ ఇంటర్వ్యూలో ఐఐఎం ప్రొఫెసర్‌ చిన్మయ్‌ తుంబే
ఎన్‌.విశ్వప్రసాద్
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రాల్లో అధికారికంగా నమోదైన కొవిడ్‌ మరణాలు, మొత్తం మృతుల గణాంకాలు సేకరిస్తున్నాం. ఇప్పటివరకూ వివరాలు అందిన నాలుగు ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులలో 2021 జనవరి నుంచి మే వరకూ కొవిడ్‌ మృతుల సంఖ్యను కేవలం సుమారు 37,000గానే చూపించారు. కానీ ఈ రాష్ట్రాల్లో గత సంవత్సరాల సగటు సంఖ్యలతో పోలిస్తే, ఈ అయిదు నెలల్లో 5.29 లక్షల మరణాలు అదనంగా నమోదయ్యాయి. అధికారికంగా ప్రకటించిన కొవిడ్‌ మరణాల సంఖ్య కంటే ఇది సుమారు 14 రెట్లు అదనం.

అన్ని రాష్ట్రాల్లో సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ ద్వారా మరణాలను నమోదు చేస్తారు. ల్యాబ్‌ పరీక్షలో కొవిడ్‌ అని తేలి చనిపోయిన వ్యక్తుల పేర్లనే అధికారిక జాబితాలో చేరుస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ల్యాబ్ పరీక్షలు జరగకుండానే చనిపోయారు. అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో మరణాల నమోదు కూడా సరిగా జరగదు.

కొవిడ్‌ మరణాలను ప్రభుత్వాలు అతి తక్కువగా చూపిస్తున్నాయని.. రెండోదశ ప్రబలిన 2021లోనే దేశంలో అధికారిక లెక్కల కంటే ఎక్కువగా కనీసం 15 లక్షల మంది మరణించి ఉంటారని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) అహ్మదాబాద్‌ అర్థశాస్త్ర ప్రొఫెసర్‌ చిన్మయ్‌ తుంబే అంచనా వేశారు. ఇవి ప్రాథమిక లెక్కలు మాత్రమేనని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ‘ఈనాడు - ఈటీవీ భారత్‌’లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. కరోనాతోపాటు, గతంలో ప్రబలిన మహమ్మారులపైనా తుంబే పరిశోధన చేస్తున్నారు. ఇటీవల ‘ది ఏజ్‌ ఆఫ్‌ పాండమిక్స్‌’ అనే పుస్తకం కూడా రాశారు. గతంలో వలసలపై అధ్యయనం చేసిన ఆయన వలస కార్మికులపై కేంద్ర ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన కార్యబృందంలో పనిచేశారు.

కొవిడ్‌ మరణాలపై ప్రభుత్వాల లెక్కలకు, వాస్తవాలకు పొంతన ఉండట్లేదు. మీ పరిశోధన ప్రకారం దేశంలో కరోనాతో ఎంతమంది చనిపోయి ఉంటారు?

జవాబు: మొదటిదశతో పోలిస్తే రెండో దశలో మరణాల సంఖ్యను ప్రభుత్వాలు బాగా తక్కువగా చూపిస్తున్నాయి. మొదటిదశలో సుమారు 1.50 లక్షల మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవ సంఖ్య అంతకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ ఉండవచ్చని అంచనా. అప్పట్లో లెక్కల్లోకి రాని మరణాల సమాచారం ఇప్పటికీ బయటకు వస్తోంది. ఈ ఏడాది సంభవించిన రెండోదశలో ఏప్రిల్‌, మే నెలల్లో మహమ్మారి అత్యంత వేగంగా, ప్రమాదకరంగా ప్రబలింది. అనూహ్యరీతిలో ప్రాణాలను బలితీసుకుంది. మేం గణాంకాలు సేకరించిన నాలుగు రాష్ట్రాల జనాభా దేశంలో సుమారు 20 శాతం ఉంటుంది. వీటి ఆధారంగా లెక్కలు కడితే భారత్‌లో రెండో దశలోనే వెల్లడి కాని కొవిడ్‌ మరణాలు కనీసం 15 లక్షలుంటాయని అంచనా. ఇంకా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల వివరాలు రావాల్సి ఉంది. అవి అందితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.

భారత్‌, అనేక ఇతర దేశాలు 1918లో ఇన్‌ఫ్లుయెంజా మహమ్మారిని ఎదుర్కొన్నాయి. దాని వల్ల చనిపోయినవారిని గుర్తించడంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?

భారత్‌లో కొవిడ్‌ మాదిరే ఇన్‌ఫ్లుయెంజా రెండోదశలో దారుణ ప్రభావం చూపింది. 1918 సెప్టెంబరు నుంచి మూడునెలల పాటు చాలా తీవ్రంగా ఉంది. అప్పట్లో ల్యాబ్‌లు లేక జ్వరంతో చనిపోయినవారిని పరిగణనలోకి తీసుకునేవారు. ఆ మహమ్మారి వల్ల 60 లక్షల మంది చనిపోయారని అప్పటి శానిటరీ కమిషనర్‌ నార్మన్‌వైట్‌ 1919లో ప్రకటించారు. తర్వాత 1921లో జనగణన చేస్తే, కొన్ని గ్రామాల్లో అసలు జనాభా కనిపించలేదు. మరణాల సంఖ్య కోటి వరకూ ఉంటుందని అప్పుడు అంచనాలు సవరించారు. నా పరిశోధన ప్రకారం ఆ సంఖ్య రెండు కోట్ల వరకూ ఉంటుంది. మొదట ప్రకటించిన దానికంటే ఇది మూడురెట్లు ఎక్కువ.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా, మృతుల వివరాలు సరిగా సేకరించలేకపోతున్నాం. కారణమేంటి?

వివిధ రాష్ట్రాల్లో మరణాలపై మేం గణాంకాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వాలు సరైన సమాచారాన్ని వెల్లడించడంలేదు. తొక్కిపెడుతున్నాయని అర్థమవుతోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన అదనపు మరణాలను ఇప్పటికీ కరోనా జాబితాలో చేర్చలేదు. భవిష్యత్తులో మరో మహమ్మారి వచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలంటే... దేశంలోని అన్ని జిల్లాల్లో ఏ రోజు ఎంతమంది ఏ కారణాలతో చనిపోయారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాలి. మహమ్మారుల విషయంలో మరణాలను.. యుద్ధాల సమయంలో చూసినట్లు పరిగణించాలి. యుద్ధాల వల్ల సైనికులే కాదు పౌరులూ చనిపోతారు. అలాగే మహమ్మారి సోకినవారితో పాటు, దాని వల్ల ఏర్పడ్డ పరిస్థితుల వల్ల కూడా అనేక మంది మరణిస్తారు.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ వాస్తవ మరణాలకు, ప్రభుత్వ లెక్కలకు తేడా ఉంటోంది. దీనిపై మీరేమంటారు?

అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మృతుల సంఖ్యను ఒకటిన్నర, రెండు రెట్లు తక్కువగా చూపిస్తున్నారు. మన దేశంలోనూ తొలుత ముంబయి వంటి చోట్ల తక్కువగా చూపించారు. రెండోదశలో మహమ్మారి ప్రభావం అత్యంత వినాశకరంగా ఉంది. ఈసారి గ్రామీణ ప్రాంతాలకు విపరీతంగా విస్తరించింది. అక్కడ పరీక్షలకు సౌకర్యాలు లేవు. పట్టణాలు, నగరాల్లోనూ ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. దీంతో వైద్యం అందక పెద్దసంఖ్యలో ప్రజలు చనిపోయారు. గుండెజబ్బు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న అనేకమంది కూడా కొవిడ్‌ సమయంలో చికిత్స అందక మృతి చెందారు.

భారత్‌లో 1918లో ఇన్‌ఫ్లుయెంజా ప్రబలిన కాలానికి, ఇప్పటికి సారూప్యతలు కనిపిస్తున్నాయి. అప్పటిలాగే గంగానదిలో పెద్దఎత్తున మృతదేహాలు కనిపించాయి. ఇలాంటి వైఫల్యాలకు కారణమేమిటి?

గత ఏడాది నేను పుస్తకం రాసేటప్పడు 1918 నాటి సంఘటనలనూ ప్రస్తావించాను. అవే సన్నివేశాలు 2021లోనూ కనిపిస్తాయని ఊహించలేదు. మరణాలు అపరిమితమై... శ్మశానవాటికలు ఖాళీ లేక మృతదేహాలను నదిలో విసిరేశారు. అనేక స్థాయుల్లో తీవ్రమైన వైఫల్యం వల్ల దేశంలో రెండోదశ కరోనా ఎంత వినాశకరంగా ఉండనుందో అంచనా వేయలేకపోయారు. మన దేశంలో 1918లో ఇన్‌ఫ్లుయెంజా, ఇప్పుడు అమెరికా, బ్రిటన్లలో కరోనా మహమ్మారి విడతల వారీగా విరుచుకుపడ్డాయి. ఈ విషయాలను మనం పరిగణనలోకి తీసుకోలేదు. గత డిసెంబరు తర్వాత తేలిగ్గా వ్యవహరించడంతో తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1918తో పోల్చినప్పుడు ఇప్పుడు ఆ స్థాయి నష్టం లేదు. ఇప్పుడు మరణాల నమోదులో ఎంతో మెరుగ్గా ఉండాల్సింది. కానీ విఫలమయ్యాం.

మహమ్మారులు ప్రబలినప్పుడు ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి?

చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు సైన్సుకు సంబంధించిన తాజా పరిణామాలను అవగాహన చేసుకోవాలి. తదనుగుణంగానే చర్యలకు ఉపక్రమించాలి. ఇది లేకనే మనం వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇవ్వడంలోనూ జాప్యం జరిగింది. కొందరు కేంద్రమంత్రులు ఫిబ్రవరిలో... ‘కొవిడ్‌ సమస్య ఇక లేదు.. సమసిపోయింది’ అన్న రీతిలో మాట్లాడారు. అవి దశలవారీగా ప్రబలుతాయన్న అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వాలకు సహనం ఉండాలి. మహమ్మారులపై ఓపికగా పోరాడాలి. వాటిపై విజయం సాధించామన్న ప్రకటనలు చేయకూడదు.

కరోనా మరణాలను సరిగా లెక్కించకపోవడం వల్ల వచ్చే సమస్యలేంటి?

తీవ్రమైన ప్రభావాలుంటాయి. మొన్న ఏప్రిల్‌, మే నెలల్లో కేంద్రప్రభుత్వం ఆక్సిజన్‌ను, మందులను కేవలం కేసులు, మరణాల ఆధారంగానే పంపింది. అప్పుడు అధికారిక లెక్కల ప్రకారం కర్ణాటకలో ఎక్కువ సమస్య ఉంది. అనధికారిక గణాంకాల మేరకు మధ్యప్రదేశ్‌లో సమస్య తీవ్రత ఇంకా ఎక్కువ. కానీ మధ్యప్రదేశ్‌కు తగినంత సాయం అందలేదు. కేంద్ర విధానానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. ప్రస్తుత సమస్య సమాచారాన్ని వెల్లడించకపోవడంలోనే ఉంది.

కరోనాతో దెబ్బతిన్న వలస కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు చేయాల్సిందేమిటి?

వీరికి సంబంధించి కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. ‘ఒక దేశం- ఒక రేషన్‌ కార్డు’ విధానాన్ని అమలు చేస్తోంది. కార్మికులు పనిచేసే రాష్ట్రంలోనే రేషన్‌ తీసుకోవచ్చు. కానీ చాలా మంది కార్మికులకు ఇది తెలియదు. దీనిపై బాగా ప్రచారం చేయాలి. పనిచేసే చోట కార్మికులు ఓటర్లు కాదు కనుక, రాజకీయ పార్టీలు వారిని పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం వారందరికీ టీకాలు వేయడం చాలా ముఖ్యం.  పనిచేయించుకునే కంపెనీలు కూడా బాధ్యత తీసుకోవాలి. కార్మికుల పిల్లల చదువులు దెబ్బతినకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక శ్రద్ధ వహించాలి.

మరణ ధ్రువీకరణ పత్రాలకు పాట్లు

తమవారి మరణ ధ్రువీకరణ పత్రాల కోసం సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం కేజీహెచ్‌లోని సంబంధిత విభాగం వద్ద మృతుల బంధువులు, కుటుంబీకులు ఇలా బారులు తీరారు. గంటల తరబడి వరుసలో నిల్చున్నారు. ఎక్కువ మంది తరలిరావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వచ్చిన వారు భౌతిక దూరం పాటించకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. సాంకేతిక పరమైన లోపాలతో త్వరగా ధ్రువపత్రాలు ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు.   

- ఈనాడు, విశాఖపట్నంTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని