అమ్మకానికి గాలి మేడలు

ప్రధానాంశాలు

అమ్మకానికి గాలి మేడలు

హైదరాబాద్‌లో సరికొత్త రియల్‌ దందా
అనుమతులు రాకముందే ప్రీలాంచ్‌ పేరుతో విక్రయాలు
యూడీఎస్‌ కింద ఫ్లాట్‌ కాకుండా స్థలం రిజిస్ట్రేషన్‌
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో సరికొత్త దందా నడుస్తోంది. అనుమతులు రాకుండానే.. రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను ప్రీలాంచ్‌ పేరుతో కుప్పలుతెప్పలుగా విక్రయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు కొందరు బిల్డర్లు. తక్కువ ధర అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిస్తూ కొనుగోలుదారుల నుంచి మొత్తం సొమ్ము ముందే కట్టించుకుంటున్నారు. మూడునాలుగేళ్లలో నిర్మాణం పూర్తయ్యేసరికి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు విలువ పలుకుతుందని నమ్మబలుకుతున్నారు. కట్టిన సొమ్ముకు ఏంటి గ్యారంటీ అంటే ఫ్లాట్‌ కొంటే వాటా కింద వచ్చే అవిభాజ్యపు స్థలాన్ని (యూడీఎస్‌) రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు సైతం కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. మూడేళ్లలో పాతికవేల కోట్ల విలువైన లావాదేవీలు ఈ తరహాలో జరిగినట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.

* * * * *

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అయినా, లేఅవుట్‌లో స్థలమైనా విక్రయించాలంటే జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ/స్థానిక సంస్థల నుంచి నిర్మాణ, లేఅవుట్‌ అనుమతి పొందాలి. ఈ వివరాలతో రెరాలో నమోదు చేయించాలి. కొనుగోలుదారుల హక్కులు కాపాడేందుకే కొత్తగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అధారిటీ (రెరా)ని కేంద్రం తీసుకొచ్చింది. రెరా ప్రకారం ప్రీలాంచ్‌ బుకింగ్స్‌ చేపట్టరాదు. అనుమతులన్నీ వచ్చాక రెరా రిజిస్ట్రేషన్‌ అయ్యాకే విక్రయించాలి. రెరా వచ్చాక కొనుగోలుదారులకు భరోసా ఉంటుందనుకుంటే ప్రస్తుతమది గాల్లో దీపంలా మారింది. బిల్డర్లు గాల్లోనే మేడలు కట్టి విక్రయిస్తున్నారు.
పైసా పెట్టుబడి లేకుండానే..
ఇలా స్థలం కొన్న వారందరి నుంచి బిల్డర్‌ జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కమ్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవరాఫ్‌ అటార్నీని రాయించుకుంటున్నారు. అవిభాజ్యపు స్థలాన్ని నిర్మాణం చేపట్టడానికి వీలుగా తిరిగి బిల్డర్‌ తీసుకుంటున్నారు. ఆ తర్వాత అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. అనుమతులు వచ్చి పూర్తి చేసేవరకు ఎంతలేదన్నా మూడు నాలుగేళ్లు పడుతుంది. ఐదు అంతస్తులైతే రెండేళ్లలో, ఆకాశహర్మ్యాలైతే మూడు నాలుగేళ్లలో పూర్తిచేసి ఇస్తామని బిల్డర్లు కొనుగోలుదారులకు చెబుతున్నారు. ఇక్కడ పైసా పెట్టుబడి లేకుండా కొనుగోలుదారుల నుంచి మొత్తం సొమ్ము రాబట్టి భూ కొనుగోలుకు, నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. తెలివైన వ్యాపార ఎత్తుగడగా కొందరు బిల్డర్లు దీన్ని సమర్థించుకుంటున్నా.. అనుమతులు రాకపోయినా, ఆలస్యమైనా, అనుకున్న విధంగా మొత్తం ఫ్లాట్లు బుకింగ్‌ కాకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి నిర్మాణాలు ఆగిపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడిదారుల సొమ్ముకు రక్షణ ఉండదని క్రెడాయ్‌ వర్గాలు అంటున్నాయి. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే సామర్థ్యం మీదే కొనుగోలుదారుల చేతికి ఫ్లాటు వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుందంటున్నారు.
కొన్నవారూ ప్రమోటర్లే..
కొత్తగా వచ్చిన రెరా చట్టం ప్రకారం బిల్డర్లే కాదు స్థలాన్ని అభివృద్ధికి ఇచ్చినవారినీ ప్రమోటర్‌గానే పరిగణిస్తారు. ఏ కారణంగానైనా నిర్మాణాలు సగంలోనే ఆగిపోతే వందలాది ఇతర కొనుగోలుదారులకు జవాబుదారీగా మారుతారు. అవిభాజ్యపు స్థలాన్ని కొన్నవారూ బాధితులే అయినా ఎవర్ని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రెరాలో వీరు సైతం బాధ్యులే. పైగా ఆ స్థలాన్ని అమ్ముకుందామన్నా అవిభాజ్యం కావడంతో కుదరదు. అన్నిరకాలుగా ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉంది. బిల్డర్లు మాత్రం ఎక్కడా చట్టపరంగా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా జరిగితే కొనుగోలుదారే నష్టపోయే అవకాశం ఉంది. యూడీఎస్‌ కింద ప్రారంభించిన వాటిలో అనుమతులు రానివే ఎక్కువ. కొన్ని దరఖాస్తు దశలో ఉన్నాయి. రెండేళ్ల క్రితం సొమ్ము చెల్లించి ఇంకా ప్రారంభం కాని ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులు కొందరు సొమ్ము వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న ఉదంతాలు బయటకొస్తున్నాయి. కొందరు వారి స్థానంలో మరొకరికి యూడీఎస్‌లో చేర్చి వారి సొమ్మును వెనక్కి తీసుకుని బయటపడుతున్నారు. పశ్చిమ, తూర్పు హైదరాబాద్‌లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టారు.
ఆదాయానికి గండి..
అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పురోగతిలో ఉండగా కొనుగోలు చేస్తే జీఎస్‌టీ 5 శాతం, రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ ఛార్జీలు కలిపి మరో 6 శాతం చెల్లించాలి. ఈ మేరకు ప్రభుత్వానికి భారీ ఎత్తున పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అవిభాజ్యపు స్థలం కాబట్టి కేవలం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అది కూడా స్థలం విలువ ప్రకారం కాబట్టి కొద్ది మొత్తమే వస్తుంది. ఈ విధంగా రూ. 1000 కోట్ల వరకు సర్కారు ఆదాయానికి గండిపడినట్లు పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఇటు కొనుగోలుదారులకు, అటు సర్కారుకు జరుగుతున్న నష్టం గురించి ప్రభుత్వం, రెరా దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు క్రెడాయ్‌ సభ్యులు చెప్పారు.

యూడీఎస్‌ కాన్సర్‌లా మారింది..

అవిభాజ్య స్థలం (యూడీఎస్‌) విక్రయిస్తూ తక్కువ ధరకే ఫ్లాట్లను నిర్మించి ఇస్తామని పెద్ద ఎత్తున నగరంలో ముందస్తు అమ్మకాలు జరుగుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ గృహ, వాణిజ్య నిర్మాణాలకు బుకింగ్స్‌ చేస్తున్నారు. సింహభాగం నిర్మాణంలో ఉన్నాయి. పది నుంచి ఇరవై అంతస్తులు కడతామని అంటున్నారు. వీరిలో 90 శాతంమందికి కట్టే ఆర్థిక స్తోమత లేదని మా పరిశీలనలో తేలింది. ఇప్పటికే ఈ తరహా అనైతిక కార్యకలాపాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం సైతం రిజిస్ట్రేషన్‌, జీఎస్‌టీ రూపంలో ఆదాయం కోల్పోతుంది. వీటిలో కొని మోసపోవద్దు. కొనుగోలుదారులు నష్టపోకముందే ప్రభుత్వం చొరవ చూపాలి.

- పి.రామకృష్ణారావు. వి.రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌

సాధారణంగా..

అనుమతి ఉన్న నిర్మాణంలోని ఫ్లాట్‌ కొంటే దశలవారీగా సొమ్ము వెలుసుబాటు ఉంటుంది. నిర్మాణ పురోగతిని బట్టి ఇక్కడ చెల్లింపులు చేస్తుంటారు. పూర్తయిన నిర్మాణంలో ఒకేసారి చెల్లించి ఇంట్లోకి దిగిపోతుంటారు. సాధారణంగా చట్టబద్ధంగా సాగుతున్న రియల్‌ వ్యాపారమిది. బిల్డర్‌ సొంత స్థలం, లేకపోతే భూయాజమాని నుంచి డెవలప్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం చేస్తుంటారు.
ప్రస్తుతం జరుగుతున్న తంతు..
రెండు మూడేళ్లుగా కొందరు బిల్డర్లు సిండికేట్‌గా ఏర్పడి కొత్త వ్యాపార పద్ధతిని తెరమీదకు తీసుకొచ్చారు. ఎంపిక చేసుకున్న ప్రాంతంలో మూడునాలుగు ఎకరాల స్థలం చూస్తున్నారు. కొంత మొత్తం భూయాజమానికి అడ్వాన్స్‌గా చెల్లిస్తున్నారు. ఈ స్థలాన్ని చూపించి ఇక్కడ అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయం వస్తాయనిచెప్పి.. అందులో మీకు ఫ్లాట్‌, వాణిజ్య స్థలం మార్కెట్‌ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని చెప్పి విక్రయిస్తున్నారు. సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపు అడుగు రూ. 3,000 ఉన్నచోట రూ. 2,000కు, రూ. 3500 ఉండేచోట రూ. 2500కు, రూ.5వేలు ఉన్న చోట రూ. 3600కు విక్రయిస్తున్నారు. కొన్న ఫ్లాట్‌ విస్తీర్ణాన్ని బట్టి నిర్మాణం పూర్తయ్యాక వాటాగా వచ్చే అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని