close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరీక్షలే జీవిత పరమార్థం కాదు

  కష్టమైన పాఠ్యాంశాన్ని పొద్దున్న, సులభమైనవాటిని రాత్రి చదవండి
  తల్లిదండ్రులూ! బలవంతపు రుద్దుడు వద్దు
  ‘పరీక్షా పే చర్చా’లో ప్రధాని సూచనలు
  భయం లేకుండా పరీక్ష ఎలా రాయాలని మోదీని ప్రశ్నించిన పొదిలి విద్యార్థిని పల్లవి

ఈనాడు, దిల్లీ: పరీక్షలే జీవిత పరమార్థం కాదనీ, సుదీర్ఘ ప్రయాణంలో అవి చిన్న గమ్యాలు మాత్రమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ పేరుతో బుధవారం ఆయన వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. కష్టంగా అనిపించే పాఠ్యాంశాలను వదిలిపెట్టేయకుండా ఉదయాన్నే వాటిని చదవాలని, కాస్త సులభంగా అనిపించేవాటిని రాత్రిపూటైనా చూసుకోవచ్చని చెప్పారు. ‘‘పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను’’ అని ప్రధాని చెప్పారు. తన స్వీయ అనుభవాలను మేళవిస్తూ.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రధాని చేసిన సూచనలు ఇలా..

మనసువిప్పి మాట్లాడడం లేదు

ఇదివరకు తల్లిదండ్రులు పిల్లలతో మనసువిప్పి మాట్లాడేవారు. ఇప్పుడు అంతా కెరీర్‌, పరీక్ష, చదువు, సిలబస్‌ గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల పిల్లల అసలైన సామర్థ్యం గురించి తెలియడంలేదు. తల్లిదండ్రులు మనసుపెట్టి మాట్లాడకపోతే పిల్లల సామర్థ్యం తెలుసుకోవడానికి మార్కుల జాబితా కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. మార్కులకు అతీతంగా పిల్లల్లో శక్తిసామర్థ్యాలుంటాయి. వాటి గురించి చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదు. జీవితంలో పరీక్ష చివరి అవకాశమేమీకాదు. ఖాళీ సమయంలో ఆనందమిచ్చే పనులు చేయండి. కొత్త విషయాలు నేర్చుకొంటే దాని ప్రభావం చాలా ఉంటుంది.

తిట్టకుండా.. చెప్పింది వినండి

పిల్లలతో వచ్చే తరాల అంతరాయం తగ్గించుకోవాలంటే వారి ఆలోచనలకు దగ్గర కావాలి. మనసుతో వారి మాటలను వినండి. మీకు ఇష్టంలేని పని చేసినా తిట్టకుండా వారు చెప్పింది విని అర్థం చేసుకోండి. వారు ఏదైనా పాట, సంగీతం బాగుందని చెబితే దాన్ని మీరూ ఆస్వాదించాలి తప్పితే మా కాలం సంగీతంతో పోలిస్తే ఇవేం పాటలు, సంగీతం అని కోప్పడొద్దు. వారు వింటున్న సంగీతంలో ఆస్వాదించే గుణాలేమున్నాయో తెలుసుకొని అర్థం చేసుకుంటే పిల్లలకు దగ్గరవుతారు.

భయం వల్ల ప్రతికూలత

పిల్లల మనసుల్లో తల్లిదండ్రులు ఎప్పుడూ భయాన్ని కలిగించకూడదు. ఇలాంటి భయాల వల్ల వారిలో ప్రతికూలత తలెత్తే అవకాశం ఉంటుంది. దీని బదులు విద్యార్థుల్లో ప్రేరణ కలిగించాలి. తమ కలలు, లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు పిల్లల్ని ఒక సాధనాలుగా తల్లిదండ్రులు భావిస్తుంటారు. అది సరికాదు. పరీక్ష ఫలితాలు పిల్లల సమర్థతకు నిదర్శనం కాదు. ప్రపంచంలో విజయవంతమైన వారు ఎంతోమంది తరగతుల్లో గొప్పగా ఏమీ లేరు. పరీక్ష ఫలితాలు సరిగా లేకపోతే జీవితం నాశనం అయినట్లుకాదు. ఎవరైనా ఏ మార్గంలోనైనా విఫలమైతే మనం అందులో వెళ్లడానికి జంకుతున్నాం. ఎవరో ఏదో చేస్తే మనం అదే చేయాలనుకుంటున్నాం. ఇది మంచి ఆలోచన కాదు. పరీక్షలకు భయపడొద్దు. పరీక్షే జీవితం అన్న వాతావరణం మీ చుట్టూ అలుముకొంది. సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఒకరకమైన వాతావరణం సృష్టించి పెద్ద కష్టాన్ని దాటాలని పిల్లలను భయపెడుతున్నారు.

కష్టం గురించి తెలియాలి

తిండిపై పిల్లలకు ఆసక్తి పెరగాలంటే వంట వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలియాలి. పిల్లల ముందు దాని గురించి చర్చించాలి. వంట ఎలా అవుతుంది, ఎంత సమయం పడుతుంది, ఎన్ని వస్తువులు కావాల్సి వస్తుందో తెలియజేయాలి. గుర్తుంచుకొనే శక్తిలేదన్న మాట వదిలిపెట్టండి. ఏ పుస్తకంలో నేర్చుకోకుండానే మీరు మాతృభాష మాట్లాడేస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇంట్లో తోబుట్టువులతో గొడవపడినప్పుడు అందులో నిమగ్నమై ఉంటారు కాబట్టి అన్నీ గుర్తుంచుకుంటారు.

చట్రంలో బంధించవద్దు

మనం ఒక చట్రం తయారుచేసి అందులో పిల్లలను బంధించడానికి ప్రయత్నిస్తాం. వారిని సామాజిక హోదా చిహ్నంగా మారుస్తాం. మన కలలను నెరవేర్చుకోవడానికి వారిని ఒక పరికరంగా చూస్తాం. ఉదయం లేవడంవల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎప్పుడైనా చర్చ మొదలుపెట్టారా? మన చుట్టుపక్కల వారి జీవితాలను గమనిస్తూ ఉండాలి. ఎన్నో వృత్తులు ఉన్నాయి. వాటిని నేర్చుకొని నైపుణ్యం పెంచుకొని లాభం పొందాలి. కలలను కంటూ నిద్రపోవడం కాదు.. వాటిని సాకారానికి ప్రయత్నించడం ముఖ్యం.

పరీక్ష హాల్లో మనసు ప్రశాంతం

పరీక్ష హాల్‌లోకి వెళ్లేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అశాంతి, చింత, గందరగోళంగా ఉంటే ప్రశ్నపత్రం చూసిన వెంటనే కొంతసేపు అన్నీ మర్చిపోతారు. భయం నుంచి బయటపడి శాంతంగా పరీక్షలు రాయడానికి ‘ఎగ్జామ్‌ వారియర్‌’ పుస్తకం చదవండి. కొన్ని కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. కరోనా సమయంలో పాఠశాలలకు దూరమయ్యారు కాబట్టి మీకు స్నేహితులు, టీచర్ల విలువ తెలిసి వచ్చి ఉంటుంది. మీ చుట్టుపక్కల దొరికే వస్తువులన్నీ ఇప్పటివరకూ మీరు రొటీన్‌ అనుకొని ఉంటారు. కరోనా సమయంలో అవి దొరకనప్పుడు వాటి ప్రాధాన్యం ఎంతో తెలిసి ఉంటుంది. కరోనా పాఠాలను జీవితాంతం గుర్తుంచుకోవాలి. తెలిసో తెలియకో మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కరోనా సమయంలో ఒక అవకాశం లభించి ఉంటుంది. ఉమ్మడి కుటుంబ బలం ఎంతో తెలిసి ఉంటుంది. కరోనా కాలంలో కుటుంబ జీవనంలో వచ్చిన మార్పులపై పరిశోధకులు అధ్యయనం చేయాలి.

ప్రధానికి పొదిలి విద్యార్థిని ప్రశ్న

పొదిలి, న్యూస్‌టుడే: ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. ‘కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండ’ని ఆమె కోరింది. దానికి ప్రధాని స్పందించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు