close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భగత్‌.. జానారెడ్డిల మధ్యే పోటీ

సాగర్‌లో తెరాసదే విజయం
ఉపఎన్నిక తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు
సీఎం దృష్టికి రేషన్‌, పింఛన్ల అంశం
ట్విటర్‌ ముఖాముఖిలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధిస్తుందని రాష్ట్రమంత్రి కేటీ రామారావు అన్నారు. పాతతరం నాయకుడైన జానారెడ్డి.. భవిష్యత్తు ఆశాకిరణమైన యువనేత నోముల భగత్‌ల మధ్యే అక్కడ పోటీ అని చెప్పారు. ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడుతుందని తెలిపారు. ఔషధనగరికి భూసేకరణ చివరి దశలో ఉందని, త్వరలోనే పెట్టుబడిదారులకు భూములను కేటాయిస్తామన్నారు. ఔషధనగరితో పాటు వరంగల్‌లో నిర్మిస్తున్న దేశంలోని అతిపెద్ద కాకతీయ జౌళి పార్కుకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి ఫైబర్‌ గ్రిడ్‌ను 12,751 గ్రామాలకు విస్తరిస్తామన్నారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్ల అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదనంగా కొవిడ్‌ టీకాలు పంపాలన్న రాష్ట్ర  విజ్ఞప్తిపై కేంద్రం నుంచి సమాచారం రాలేదన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకున్నారని తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు గురించి బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన వ్యక్తిని ప్రశ్నించాలన్నారు. ‘కేటీఆర్‌ను అడగండి’ (ఆస్క్‌ కేటీఆర్‌) పేరిట ఆదివారం ఆయన ట్విటర్‌లో నెటిజన్లతో ముఖాముఖి నిర్వహించారు.

నేనా? సినిమాలా?

మీరు హీరోలా ఉన్నారు. సినిమాల్లో ఏమైనా ప్రయత్నించారా అని ఒక నెటిజన్‌ కేటీఆర్‌ను అడిగారు. ‘‘నేనా? సినిమాలా? నన్ను పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావు’’ అని ఆయన చమత్కరించారు.
మనసు మాట వినాలి: నా కూతురికి, కొడుకుకి మనసు మాట వినాలని చెబుతా. ప్రత్యేకంగా ఎలాంటి సూచనలూ ఇవ్వను. నా ఆలోచనలను సూటిగానే వ్యక్తీకరిస్తా. ఎప్పటికప్పుడు మాట్లాడే విధానాన్ని మెరుగుపరుచుకుంటా. త్వరలోనే కరోనా టీకా తీసుకుంటా. నా అభిమాన క్రికెటర్‌ అప్పుడు రాహుల్‌ ద్రావిడ్‌. ఇప్పుడు విరాట్‌ కోహ్లి. త్వరలోనే తెరాస సామాజిక మాధ్యమ యోధులతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం. భాజపా ఇతర పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడతాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

ప్రాంతీయ రింగ్‌ రోడ్‌కు  బడ్జెట్‌లో నిధులు

‘‘హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌ రోడ్డు భూసేకరణకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులను కేటాయించాం. ఒకటి, రెండు నెలల్లో టీహబ్‌ భవనం ప్రారంభమవుతుంది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో ఐటీ హబ్‌లొస్తున్నాయి. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు త్వరలోనే వాస్తవరూపం దాలుస్తుంది. ప్రభుత్వ విధానాలపై ప్రతిభగల విద్యార్థుల నుంచి సలహాలు తీసుకుంటాం. అనంతగిరిని అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. రాజకీయాల్లోనూ అప్రెంటీస్‌షిప్‌ ఉండాలనేది మంచి ఆలోచన.హరితహారంతో నాలుగుశాతం పచ్చదనం పెరిగింది. మహబూబ్‌నగర్‌కు నగరపాలక సంస్థ హోదా కల్పిస్తాం. మరో పది నెలల్లో 6 కిలోమీటర్ల ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రారంభమవుతుంది. నగరంలో 50కి పైగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌లో వరద కాలువల నిర్మాణం దీర్ఘకాలం పడుతుంది. జీహెచ్‌ఎంసీ పెద్దఎత్తున మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. కొంతమంది వాటిని ధ్వంసం చేస్తున్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధికి రూ.858 కోట్లు మంజూరు చేశాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు