TS News: యాదాద్రీశుని సన్నిధిలో సీజేఐ
close

ప్రధానాంశాలు

TS News: యాదాద్రీశుని సన్నిధిలో సీజేఐ

సతీసమేతంగా దర్శించుకున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ఆలయ పునర్నిర్మాణాల పరిశీలన

ఈనాడు, నల్గొండ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ మంగళవారం సతీసమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు చేరుకున్న ఆయనకు అతిథి గృహం వద్ద మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా విచ్చేసిన జస్టిస్‌ రమణకు ఆలయ అర్చకులు స్వర్ణకలశంతో కూడిన సంప్రదాయ పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలోని పంచనారసింహులను దర్శించుకొన్న సీజేఐ దంపతులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, స్వర్ణ పుష్పార్చన చేశారు. అనంతరం పండితుల నుంచి వేదాశీర్వచనం పొందారు. సుమారు గంట పాటు బాలాలయంలోనే గడిపిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. సీజేఐ దంపతులకు ఆలయ పక్షాన స్వామి అమ్మవార్ల జ్ఞాపికను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి బహూకరించారు. పట్టు వస్త్రాలను ఆలయ ఈవో గీతారెడ్డి, ప్రసాదాలను అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేశారు.

ఆలయ నిర్మాణానికి ప్రశంస
బాలాలయంలో దర్శనానంతరం జస్టిస్‌ రమణ పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయాన్ని సందర్శించారు. ఆలయంలోని మాడ వీధులు, అష్టభుజ ప్రాకార మండపంలోని శిల్పకళా పనులను, ఇతర నిర్మాణాలను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు జస్టిస్‌ రమణ దంపతులకు వివరించారు. పూర్తిగా కృష్ణశిలతో ఆలయాన్ని రూపొందించడం అద్భుతమని జస్టిస్‌ రమణ ప్రశంసించారు. రాబోయే తరాల్లో భక్తిభావం పెంపొందించేలా నిర్మాణాలు చేశారని కొనియాడారు. ప్రధానాలయానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌ను ప్రధాన ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి వివరించారు. ప్రధానాలయంలోని స్వయంభూలను దర్శించుకున్న జస్టిస్‌ దంపతులు గర్భగుడి, గోపురాలు, మాడవీధుల్లోని శిల్పకళా సంపదను పరిశీలించారు. అక్కడి నుంచి ఆలయ ఉత్తర దిశలో నిర్మితమవుతున్న ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌, గండిచెరువు వద్ద నిర్మిస్తున్న పుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపం, దీక్షాపరుల మండపం, అన్నదాన సత్రం భవనాలను కాన్వాయ్‌ నుంచి దిగి పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అలయనగరిని సందర్శించారు. అక్కడ యాత్రికులు, వీవీఐపీల కోసం నిర్మితమవుతున్న కాటేజీలను పరిశీలించారు. క్షేత్రంలో పచ్చదనాన్ని వృద్ధి చేయడం హర్షణీయమని యాడాను ప్రశంసించారు. దాదాపు మూడున్నర గంటల పాటు క్షేత్రంలో గడిపిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌, కలెక్టరు పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తొలి విడిది వారిదే..
యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో కొండపై కొత్తగా నిర్మించిన అతిథి గృహంలో ప్రప్రథమంగా సీజేఐ జస్టిస్‌ రమణ బస చేశారు. ఈ క్షేత్ర పర్యటనలో ప్రధాన న్యాయమూర్తి విశ్రాంతి కోసం కొత్త అతిథి గృహాన్ని అధికారులు హుటాహుటిన సిద్ధం చేశారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపై ఉన్న పాత వసతి సముదాయాలన్నింటినీ కూల్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలయాలతో సహా ఈవో క్యాంప్‌ కార్యాలయం, వీఐపీ అతిథిగృహాన్ని మాత్రమే నిర్మించారు. అతిథి గృహాన్ని తొలిసారి సీజేఐకి కేటాయించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని