60 వేలకు తగ్గిన కొవిడ్‌ కేసులు
close

ప్రధానాంశాలు

60 వేలకు తగ్గిన కొవిడ్‌ కేసులు

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. రోజువారీ కేసులకు సంబంధించి ఈనెల 13న 80 వేలు, 14న 70 వేలకు పైగా నమోదు కాగా మంగళవారం ఆ సంఖ్య 60,471కి తగ్గింది. 75 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా మరింత తగ్గి 3.45%కి చేరింది. గత 24 గంటల్లో 2,726 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,95,70,881కి చేరగా ఇంతవరకు 3,77,031 మంది కొవిడ్‌కు బలైపోయారు. మరణాల రేటు 1.28 శాతానికి పెరిగింది.
దేశవ్యాప్తంగా సోమవారం 17,51,358 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. వారపు పాజిటివిటీ రేటు 4.39 శాతానికి తగ్గింది. ఒక్క రోజులో 1,17,525 మంది కోలుకోగా వరుసగా 33వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రికవరీ రేటు 95.64%కి పెరిగింది. కొవిడ్‌ బారిన పడినవారిలో ఇంతవరకు 2,82,80,472 మంది కోలుకున్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 9,13,378 (3.09%)కి చేరింది. దేశంలో ఇంతవరకు 25,90,44,072 కొవిడ్‌ టీకా డోసులు వేశారు.
రోజువారీ మరణాల్లో 1,592 (58.40%) మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఆడిటింగ్‌ నిర్వహించి.. లెక్కలు సరిచేసి ఇందులో 1,392 మరణాలు కలిపారు. ఇవి మినహాయిస్తే మహారాష్ట్రలో కొత్తగా 200 మరణాలు సంభవించాయి. తమిళనాడులో 254 మంది చనిపోయారు.
నెల రోజుల్లో రికవరీ రేటు 85.6% నుంచి 95.6%కి పెరిగింది. వారపు పాజిటివిటీ రేటు 17.7% నుంచి 4.39%కి తగ్గింది. ఇదే సమయంలో మరణాల రేటు మాత్రం 1.10% నుంచి 1.28%కి పెరిగింది.
రోజువారీ కేసుల్లో 85% తగ్గుదల
కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో అత్యధిక రోజువారీ కేసులు నమోదైన మే 7 నాటితో పోలిస్తే ప్రస్తుతం వాటి సంఖ్య 85 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రియాశీలక కేసుల సంఖ్య 5 వేల కంటే దిగువకు చేరినట్లు తెలిపింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని