ఆ ఆరు ఎయిర్‌పోర్టులపైతెలంగాణకు నివేదికలు ఇచ్చాం

ప్రధానాంశాలు

ఆ ఆరు ఎయిర్‌పోర్టులపైతెలంగాణకు నివేదికలు ఇచ్చాం

  స్థల అనుమతులకు ప్రతిపాదనలు అందలేదు

  పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా  

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు గ్రీన్‌ఫీల్డ్‌, మరో మూడు బ్రౌన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికలను (టెక్నో ఎకనమిక్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌) ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల గురించి వివరాలు కోరుతూ నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌ జిల్లా), పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్కోటి చొప్పున మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు, వరంగల్‌ జిల్లాలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌లలో బ్రౌన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్‌ అథారిటీని వివరాలు కోరింది. వీటిపై ఏఐఐ అధ్యయనం చేసి ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు స్థల అనుమతుల కోసం ఇప్పటి వరకూ తెలంగాణ నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదు’’ అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టంచేశారు.

భారత్‌మాల కిందకు రీజినల్‌ రింగ్‌రోడ్డు: గడ్కరీ 

తెలంగాణలో సంగారెడ్డి-నర్సాపుర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-యాదగిరిగుట్ట-చౌటుప్పల్‌ సెక్షన్‌ (ఎన్‌హెచ్‌-161 ఎఎ) వెంట ఉన్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌.ఆర్‌.ఆర్‌.) ప్రాజెక్టు ఉత్తర భాగాన్ని భారత్‌మాల పరియోజన పథకం కిందకు చేర్చినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ రీజినల్‌ రింగ్‌రోడ్డు అభివృద్ధికి సంబంధించి పదినెలల్లో డీపీఆర్‌ తయారవుతుందని చెప్పారు. డీపీఆర్‌ తయారైన తర్వాతే ఈ ప్రాజెక్టు వ్యయం, నిర్మాణం, ఇతరత్రా పనుల కోసం ఎంత ఖర్చవుతుందనేది తెలుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.  


‘కాళేశ్వరం, పాలమూరు పథకాల్లో అవినీతి తమ దృష్టికి రాలేదని రాష్ట్రం తెలిపింది’

కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వమే తన సొంత నిధులతో చేపడుతోందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. అందులో అవినీతి చోటుచేసుకున్నట్లు తమ దృష్టికేమీ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సమాచారం అందిందా? అని ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ‘‘అందుబాటులో ఉన్న వనరులు, ప్రాధాన్యాలను అనుసరించి సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలే చేపడతాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కేవలం సాంకేతిక సహకారం, కొన్ని ప్రాజెక్టులకు పాక్షికంగా నిధులు అందించడం వరకే పరిమితం. ప్రస్తుతం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు రెండింటినీ తెలంగాణ ప్రభుత్వమే సొంత వనరులతో చేపడుతోంది. అందువల్ల అవినీతి గురించి తమ దృష్టికేమీ రాలేదని సమాచారం అందించింది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన డ్యాముల్లో లీకేజీలు కనిపించినట్లు కూడా తమ దృష్టికేమీ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది’’ అని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.


  ‘రాష్ట్రంలో 28 హైకోర్టు జడ్జి పోస్టులు ఖాళీ’

దేశంలోని 25 హైకోర్టుల్లో 453 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు తెలిపారు. గురువారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎం రమేశ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఈనెల 15వ తేదీ నాటికి తెలంగాణలో 28, ఏపీలో 18 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టుకు 42 పోస్టులు కేటాయించగా 14 మంది, ఏపీ హైకోర్టుకు 37 మందికి గాను 19 మంది  పనిచేస్తున్నారు’’ అని రిజీజు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని