తక్కువ సమయంలోనే టీకా అందించాం

ప్రధానాంశాలు

తక్కువ సమయంలోనే టీకా అందించాం

శాస్త్ర, పరిశోధన, ఆవిష్కరణల్లో దేశం పురోగతి

భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా ఒక టీకా తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాల కాలం పడుతుందని, ప్రస్తుతం అందేబాటులోకి వచ్చిన సాంకేతికతతో తక్కువ సమయంలోనే కరోనా వైరస్‌కు విజయవంతంగా టీకాను అందించగలిగామని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. కరోనా లాంటి మహమ్మారులను తిప్పికొట్టడానికి మానవాళి ముందున్న పరిష్కారం టీకాలేనని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ హెపటైటిస్‌ దినం సందర్భంగా సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిమ్స్‌ వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. మానవాళికి పెనుముప్పుగా మారుతున్న హెపటైటిస్‌-బీ వ్యాధికి తక్కువ ధరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్నారు. గతంలో ఒక వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కావాలంటే ఏళ్ల తరబడి సమయం పట్టేదని, ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతికతతో వేగంగా చేయగలుగుతున్నామన్నారు. మొదట రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు భారత్‌ బయోటెక్‌కు ఎక్కువ సమయం పట్టిందని, అదే కొవిడ్‌కు తక్కువ సమయంలోనే టీకా ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసి కోట్లమంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. శాస్త్ర, పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ పురోగమిస్తోందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులు, సిబ్బంది చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కిమ్స్‌ ఆసుపత్రుల ఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు మాట్లాడుతూ కరోనాకు టీకా తేవడం దేశానికే గర్వకారణమన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపిన ఘనత భారత్‌ బయోటెక్‌కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌ సంక్షోభంలో ముందుండి సేవలందించిన 300 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం కిమ్స్‌ ఆసుపత్రుల ఛైర్మన్‌ బి.కృష్ణయ్య, ఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు డాక్టర్‌ కృష్ణ ఎల్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్‌ సీనియర్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని