ఒక నోటిఫికేషన్‌ను నిలిపివేస్తే మరొకటా!

ప్రధానాంశాలు

ఒక నోటిఫికేషన్‌ను నిలిపివేస్తే మరొకటా!

 ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూసేకరణ అమలును నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులుండగానే.. ఆ పిటిషన్‌పై విచారణ ముగియకుండా, కనీసం నోటిఫికేషన్‌ను ఉపసంహరించకుండా మళ్లీ అవే భూములకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సిరిసిల్లలో కొత్తచెరువు కట్ట అభివృద్ధి కోసం మే 22న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తచెరువు కట్ట అభివృద్ధిలో భాగంగా 4.38 ఎకరాల సేకరణ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వి.శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.ప్రతీక్‌రెడ్డి వాదనలు వినిపించారు.

చెరువుకట్ట సుందరీకరణ నిమిత్తం 2018లో కూడా నోటిఫికేషన్‌ జారీ చేయగా కోర్టును ఆశ్రయించామని, 2019లో దాని అమలును నిలిపివేసిందని తెలిపారు. పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొనకుండా తాజా నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 1వ తేదీకి వాయిదా వేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని