సింగరేణికి కేంద్రం షాక్‌

ప్రధానాంశాలు

సింగరేణికి కేంద్రం షాక్‌

దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకుల వేలం ప్రకటన

వాటిలో తెలంగాణలో 4, ఏపీలో 1..

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణికి షాక్‌ ఇచ్చింది. నాలుగేళ్లుగా తమ ఏరియాల్లోని పలు బ్లాకులను కేటాయించాలని సింగరేణి చేస్తున్న విజ్ఞప్తులను తోసిరాజని వేలంలో చేర్చింది. దేశవ్యాప్తంగా 88 బ్లాకుల వేలంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన జారీ చేసింది. ‘కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్స్‌ యాక్టు-2015’, ‘మైన్స్‌, మినరల్స్‌ (డెవలప్‌మెంట్, రెగ్యులేషన్‌) యాక్టు-1957’ ప్రకారం వేలం వేస్తున్నట్లు పేర్కొంది. ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల్లోని బ్లాకులతో పాటు తెలంగాణకు చెందిన నాలుగు గనులు వీటిలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్‌-3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్‌-3, మంచిర్యాల జిల్లా కల్యాణఖని బ్లాక్‌-6, ఇదే జిల్లా శ్రావణపల్లిలోని మరో బ్లాక్‌లను వేలం వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా సోమవరం వెస్ట్‌ బ్లాకు కూడా జాబితాలో ఉంది.

రూ.66 కోట్లతో అధ్యయనం చేసినా..

బొగ్గు లభ్యతపై అన్వేషణ కోసం సింగరేణి ఇప్పటివరకు సత్తుపల్లి బ్లాక్‌-3లో రూ.8 కోట్లు, కోయగూడెం ఓసీ-3లో రూ.18 కోట్లు, శ్రావణపల్లిలో రూ.20 కోట్లు, మంచిర్యాల కేకే-6లో రూ.20 కోట్లను ఖర్చు చేసింది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ వచ్చింది. సాలీనా 12 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, ఈ బ్లాకులు సింగరేణి లీజు పరిధిలో లేవు. ఇదే కారణంతో వేలంలో చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సంస్థ ప్రైవేట్‌ కంపెనీలతో పోటీపడి బ్లాకులను దక్కించుకోవాల్సి ఉంది. అన్వేషణ కోసం ఇప్పటివరకు చేసిన వ్యయాన్ని వేలం దక్కించున్న సంస్థల నుంచి తిరిగి రాబట్టుకునే అవకాశముండటం ఊరటనిచ్చే విషయం. కేంద్రం నిర్ణయం కోల్‌బెల్ట్‌లో చర్చనీయాంశంగా మారింది.

 


అన్ని గనులను సాధించుకుంటాం

మా లీజులో లేని భూముల్లో గనుల కోసం కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్స్‌ యాక్టు-2015 ప్రకారం వేలంలో పాల్గొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలా లేదు. మేం అధ్యయనం చేసిన నాలుగు గనులనూ కేటాయించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను అన్ని విధాలుగా కోరాం. అవన్నీ ప్రస్తుత గనుల సమీపంలోనే ఉన్నందున వేలంలోనైనా పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం.

- ఎస్‌.చంద్రశేఖర్‌, సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌)


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని