గూగుల్‌కు గుండెకాయ... అమెజాన్‌కు ఆయువుపట్టు

ప్రధానాంశాలు

గూగుల్‌కు గుండెకాయ... అమెజాన్‌కు ఆయువుపట్టు

ఫేస్‌బుక్‌కు ఇష్టమైన గమ్యం హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ గూగుల్‌కు గుండెకాయలా.. అమెజాన్‌, ఆపిల్‌ కంపెనీలకు ఆయువుపట్టులా.. ఫేస్‌బుక్‌కు తొలి ఇష్టమైన గమ్యం (ఫస్ట్‌ ఫేవరెట్‌ డెస్టినేషన్‌)గా మారిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఐటీ అంటే ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణగా మారనుందని, పరిశ్రమలు అంటే టాటాలే కాదని, తాతల కాలం నాటి కులవృత్తులు కూడా అని నమ్మి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని గొప్ప అంకుర (స్టార్టప్‌) రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి పొందిందని, కేంద్ర ప్రభుత్వ నినాదం మాత్రం ‘ప్యాకప్‌’గా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కేంద్రం అమ్మేస్తోందని విమర్శించారు. తెరాస ప్లీనరీలో.. పాలన సంస్కరణలు, విద్యుత్‌, ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై తీర్మానాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టి ప్రసంగించారు.
‘స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఏడాదిన్నర కిందట కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. అందులో పాల్గొన్న నేను తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ‘త్రీ ఐ (ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమతుల అభివృద్ధి)’ మంత్ర నడుస్తోందని చెప్పాను. ఈ మూడింటినీ దేశవ్యాప్తంగా అమలు చేస్తే, కచ్చితంగా నయా భారత్‌ను అందించవచ్చని వివరించాను.’

ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలు
‘రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలకు గడిచిన ఏడేళ్లు స్వర్ణయుగం. పది జిల్లాలను 33గా చేసి పరిపాలన సౌలభ్యం కల్పించుకున్నాం. పంచాయతీలను 12769కి పెంచాం. ప్రతి పల్లె ఒక ఆదర్శ గ్రామంగా మారింది. మున్సిపాలిటీల్లో అవినీతిని కడిగిపారేసే విధంగా కొత్త చట్టం తెచ్చాం. శాంతిభద్రతలను పటిష్ఠం చేశాం, భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతం పూర్తయ్యింది. ఇందులో రికార్డు సృష్టించాం. తెరాస ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం.. ప్రజల చుట్టం. సాగునీటి శాఖను ఒకే గొడుగు కిందకు చేర్చాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జోనల్‌ విధానం తెచ్చాం. నాడు కరెంటు అంటే సంక్షోభం.. నేడు సంతోషం. సౌరవిద్యుదుత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారు. పెట్టుబడులు పోతాయని వెక్కిరించారు. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కట్టాయి. ఒకప్పుడు విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు. తయారీ పరిశ్రమల్లో మనకు ఎదురులేదు. ఎర్రబస్సు నుంచి ఎయిర్‌బస్‌ దాకా, ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా, యాప్స్‌ నుంచి గూగుల్‌ మ్యాప్స్‌ దాకా తెలంగాణలోనే తయారవుతున్నాయి. ఔషధరంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం. భారతదేశం అబ్బురపడేలా ఒక్క రోజులో రాష్ట్ర ప్రజల బతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడం ద్వారా, దేశ చరిత్రలో కొత్త సంచలనానికి, చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది తెరాస ప్రభుత్వమే.’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.ఇవాళ తెలంగాణలో.. రేపు దేశవ్యాప్తంగా
గతంలో ‘వాట్‌ బెంగాల్‌ థింక్స్‌ టుడే.. ఇండియా విల్‌ థింక్‌ టుమారో’ (ఈ రోజు బెంగాల్‌ ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుంది) అనే నానుడి ఉండేది. కానీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో.. ‘ఇవాళ తెలంగాణలో జరిగేది.. రేపు దేశవ్యాప్తంగా జరుగుతుంది’ అనేలా రాష్ట్రం సగర్వంగా విజయ ప్రస్థానం కొనసాగిస్తోంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని