వ్యాక్సిన్‌ తయారీ.. ప్రపంచం చూపు భారత్‌ వైపు!

తాజా వార్తలు

Published : 15/09/2020 15:34 IST

వ్యాక్సిన్‌ తయారీ.. ప్రపంచం చూపు భారత్‌ వైపు!

 భారత్‌ సహకారం ఎంతో అవసరం - బిల్‌గేట్స్‌

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తయారీలో ఎంతో ముందున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఈ సమయంలో ప్రపంచానికి భారత్‌ సహకారం ఎంతో అవసరమని ఆయన‌ అభిప్రాయపడ్డారు. మిగతా దేశాల్లో వ్యాక్సిన్‌ ముందుగానే అభివృద్ధి చేసినా.. తయారీలో మాత్రం భారత్‌ సహకారం ఎంతో కీలకమన్నారు. సమర్థవంతమైన, సురక్షితమైన వాక్సిన్‌ వచ్చిన వెంటనే, భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని బిల్‌గేట్స్‌ తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదిలోనే సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. 2021 సంవత్సరం తొలి త్రైమాసికానికి చాలా వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ అతిపెద్ద పాత్ర పోషించనుందన్న ఆయన, వీటిని అభివృద్ధి చెందుతోన్న దేశాలకు తరలించడం మాత్రం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీలో భారత్‌ పాత్ర’ అనే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగ దశలో ఉండగా, మరో 93వ్యాక్సిన్‌లు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్ట్రాజెనికా, నోవావాక్స్‌, సఫోని, జాన్సన్‌&జాన్సన్‌ వ్యాక్సిన్‌ల తయారీ భారత్‌లోనే చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బిల్‌గేట్స్‌ అన్నారు. ఇక భారత్‌లో కరోనా విజృంభణ గురించి ప్రస్తావించిన ఆయన, భారీ జనసాంద్రత కలిగిన దేశంలో వైరస్‌ కట్టడి చేయడం కాస్త కష్టమేనన్నారు. భారత్‌లో వచ్చే రెండు మూడు నెలలు ఎంతో కీలకమని బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం కృషిచేస్తోన్న కంపెనీలకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్ ద్వారా భారీ ఆర్థిక సాయాన్ని బిల్‌గేట్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని