Padmanabhaswamy Temple: ఆర్థిక సంక్షోభంలో పద్మనాభుడు

తాజా వార్తలు

Published : 18/09/2021 14:33 IST

Padmanabhaswamy Temple: ఆర్థిక సంక్షోభంలో పద్మనాభుడు

రాజ కుటుంబికుల ట్రస్టు నుంచి  సాయం అందించాలి 
సుప్రీంకోర్టులో వాదనలు

దిల్లీ: తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉందని పరిపాలన కమిటీ శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తగినంత ఆదాయం రాకపోవడం వల్ల నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది. ప్రతి నెలా ఖర్చులకు రూ.1.25 కోట్లు అవసరం ఉండగా, రూ.60-70 లక్షల ఆదాయం మాత్రమే వస్తోందని పేర్కొంది. అందువల్ల ట్రావెంకోర్‌ రాజకుటుంబికులు నిర్వహిస్తున్న ట్రస్టు నుంచి నిధులు అందేలా చూడాలని కోరింది. రాజకుటుంబీకుల ఆధీనంలోని శ్రీపద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్‌ జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఆలయ పరిపాలన కమిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌ పై విషయాలు చెప్పారు. ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. 2013నాటి ఆడిట్‌ ప్రకారం ఆ ట్రస్టు వద్ద రూ.2.87 కోట్ల నగదు, రూ.1.95 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. మొత్తం ఎంత ఆస్తులు ఉన్నాయని తెలుసుకోవడానికే ఆడిట్‌ జరగాల్సి ఉందని తెలిపారు. ఈ వాదనను ట్రస్టు తరఫున సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాతర్‌ ఖండించారు. ఆలయ పరిపాలన, రోజు వారీ వ్యవహారాలతో ట్రస్టుకు ఎలాంటి పాత్ర లేదని తెలిపారు. రాజకుటుంబీకులకు సంబంధం ఉన్న పూజలను మాత్రమే పర్యవేక్షిస్తుందని చెప్పారు. ట్రస్టుకు ఆలయంతో సంబంధం లేనందున ఆడిట్‌ చేయించాల్సిన పనిలేదని తెలిపారు. ట్రస్టు వ్యవహారాలను ఆలయ కమిటీ పర్యవేక్షిస్తుందంటే అంగీకరించబోమని తెలిపారు. ఆదాయపు పన్ను చట్టానికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. దేవాలయ ఆదాయ వ్యయాలపై 25 సంవత్సరాల ఆడిట్‌ను నిర్వహించాలంటూ గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వుల నుంచి ట్రస్టును మినహాయించాలని కోరారు.

ప్రత్యక్షంగా పరీక్షల నిర్వహణకు అనుమతి

కేరళ ప్రభుత్వం ప్రత్యక్షంగా 11వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై సంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సెప్టెంబరులో కరోనా మూడో ఉద్ధృతి వస్తుందన్న అభిప్రాయంతో తొలుత ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నామని తెలిపింది. తక్షణమే అలాంటి ప్రమాదం లేకపోవడంతో పరీక్షలకు ఇబ్బంది లేదని పేర్కొంది. 

78 సార్లు వాయిదాలే తప్ప వాదనలు వినరా?

కేసు విచారణను వాయిదాలు వేస్తూ పోవడమే తప్ప వాదనలు వినకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కనీసం అభియోగాలు నమోదు చేయకుండా గత ఏడేళ్లుగా 78 సార్లు వాయిదా వేసినందుకు దేహ్రాదూన్‌లోని దిగువ కోర్టు తీరుపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆక్షేపణ తెలిపింది. ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ముగ్గురు వ్యక్తులు ఫోర్జరీ చేసి తనను మోసగించారంటూ డాక్టర్‌ అతుల్‌ కృష్ణ అనే వ్యక్తి 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పత్రాలన్నీ ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌కు సంబంధించినవి కావడంతో కేసు అక్కడికి బదిలీ అయింది. 2014 నుంచి అక్కడ కేసు విచారణ జరుగుతోంది. బెయిల్‌పై వచ్చిన ఆ ముగ్గురు నిందితులు ఏదో కారణం చెప్పి కేసును వాయిదా వేయిస్తున్నారు. వారు సహకరించకుంటే బెయిల్‌ రద్దు చేసే అధికారం కోర్టుకు ఉందని ధర్మాసనం తెలిపింది.

నీట్‌లో రిజర్వేషన్లు వద్దంటూ వ్యాజ్యం

దిల్లీ: నీట్‌లో రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పు పడుతూ ఎనిమిది మంది ఈ దావా వేశారు. దీనిని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కు కూడా నోటీసు ఇచ్చింది. ఈ విషయమై ఇప్పటికే దాఖలైన దావాలతో కలిపి దీన్ని విచారించనుంది. అండర్‌గ్రాడ్యుయేట్, డెంటల్‌ కోర్సులతో పాటు, పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రకటన ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌ సింగ్‌ తెలిపారు. పీజీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కారణంగా పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జనరల్‌ కేటగిరీ విద్యార్థులు చాలా స్పల్పమైన మైనార్టీలుగా మిగిలిపోతారని తెలిపారు. ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని