‘దుర్గ్‌’లో కొవిడ్‌.. పేరుకుపోతున్న శవాలు

తాజా వార్తలు

Updated : 03/04/2021 15:19 IST

‘దుర్గ్‌’లో కొవిడ్‌.. పేరుకుపోతున్న శవాలు

దుర్గ్‌: రెండో దశలోకి ప్రవేశించిన కరోనా దేశంలోని ముంబయి, పుణె, నాగ్‌పూర్, దిల్లీలో తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కానీ ఎప్పుడూ పెద్దగా వార్తల్లోకి ఎక్కని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో కొవిడ్ కరాళనృత్యం చేస్తోంది. అక్కడి ఆస్పత్రుల్లోని శవాగారాల్లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. వారంలోనే 38 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరువేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వైరస్ ఉద్ధృతి తీవ్రమవ్వడంతో ఆసుపత్రులకు పెనుభారంగా మారింది. కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 6 నుంచి 14 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనుంది.

ఏప్రిల్ 2న ఛత్తీస్‌‌గఢ్‌లో కొత్తగా 4,174 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క దుర్గ్‌ జిల్లాలోనే 964 మందికి వైరస్ సోకింది. గత వారం రోజుల్లో ఆరువేలకు పైగా కేసులు బయటపడ్డాయి. కొవిడ్ తీవ్రమయ్యాక రోగులు ఆసుపత్రులకు వస్తుండటం, అప్పటికే శరీరంలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోయి ఉండటంతో ప్రాణాంతకంగా మారుతోంది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. నిత్యం నాలుగు నుంచి ఐదు మరణాలు సంభవిస్తున్నాయని దుర్గ్ జిల్లా చీఫ్ మెడికల్ సూపరిండెంట్‌ మీడియాకు వెల్లడించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 8 ఫ్రీజర్లలో 27 మృతదేహాలను భద్రపరిచారు. రెండు శ్మశాన వాటికల్లో కొవిడ్ రోగుల శ‌వాలను దహనం చేసేవారు. కానీ ఇప్పటికే ఉన్న ఆ శ్మశాన వాటికల్లో స్థలం కొరత ఏర్పడటంతో మరికొన్నింటిని సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ నరేందర్ భూరే వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని,  వారం పాటు అమల్లోకి రానున్న లాక్‌డౌన్‌తో కూడా పరిస్థితులు అదుపులోకి వస్తాయో లేదోనని  వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేవలం గత రెండు వారాల్లోనే క్రియాశీల కేసులు 369 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్చి 20న 6,753 మందికి కొవిడ్‌ సోకగా, ఏప్రిల్ 2 నాటికి ఆ సంఖ్య 28,987కి చేరింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను తీవ్రస్థాయి కరోనా పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాల జాబితాలోకి చేర్చింది. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా నిపుణుల బృందాన్ని కూడా ఆ రాష్ట్రానికి పంపటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని