చనిపోయిన తల్లి చేతుల్లో సజీవంగా పసికందు

తాజా వార్తలు

Updated : 19/05/2021 16:03 IST

చనిపోయిన తల్లి చేతుల్లో సజీవంగా పసికందు

గాజా సిటీ: పండగ పూట పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిందా తల్లి. అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో ఊహించని ఉపద్రవం. వారు ఉంటున్న భవనంపై బాంబుల వర్షం. ఆ భీకర శబ్దాలకు భయపడుతున్న తన ఐదు నెలల పసికందును గట్టిగా పట్టుకుని అలాగే కుప్పకూలింది. గాజా నగరంలో గతవారం ఇజ్రాయెల్‌ జరిపిన రాకెట్‌ దాడుల్లో ధ్వంసమైన భవన శిథిలాల వద్ద సహాయక సిబ్బందికి కన్పించిన ఓ దృశ్యం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. శిథిలాల కింద చనిపోయిన తల్లి చేతుల్లో బిక్కుబిక్కుమంటున్న ఓ చిన్నారిని సజీవంగా బయటకు తీశారు. ఈ దాడుల్లో కుటుంబంలోని 10 మంది చనిపోగా.. ఈ చిన్నారి మాత్రమే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.

గాజా నగరానికి చెందిన మహమ్మద్‌ అల్‌ హదీదీ, మహా అబు హట్టబ్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో చిన్నవాడు ఐదు నెలల ఒమర్‌ అల్ హదీదీ. గత శుక్రవారం రంజాన్‌ను పురస్కరించుకుని మహా అబు తన ఐదుగురు పిల్లలను తీసుకుని నగరానికి వెలుపల ఉన్న షాటీ శరణార్థుల శిబిరానికి వెళ్లింది. అక్కడే ఆమె సోదరులు, ఇతర బంధువులు నివాసముంటున్నారు. రాత్రికి అక్కడే ఉంటామని ఫోన్‌ చేసి చెప్పడంతో మహమ్మద్‌ సరేనన్నాడు. అదే రోజు ఈ శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది.  

దాడుల గురించి తెలియగానే మహమ్మద్‌ భయంభయంగా అక్కడకు పరుగులు తీశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భవనం నేలమట్టమై మహా అబు, నలుగురు పిల్లలు మృతిచెందారు. చిన్నారి ఒమర్‌ కూడా మరణించాడనే అనుకున్నాడా తండ్రి. కానీ అదృష్టవశాత్తూ సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా చనిపోయిన తల్లి చేతుల్లో చిన్నారి సజీవంగా కన్పించాడు. దీంతో ఒమర్‌ను పట్టుకుని అతడి తండ్రి బోరున విలపించాడు. ‘ఈ లోకంలో నాకంటూ మిగిలింది నువ్వొక్కడివే’ అంటూ అతడు విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ దాడుల్లో మహా అబు సోదరుడి భార్య, అతడి నలుగురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని