కట్టు తప్పిన కరోనా..ఒక్కరోజే లక్షమందికి వైరస్

తాజా వార్తలు

Updated : 05/04/2021 10:33 IST

కట్టు తప్పిన కరోనా..ఒక్కరోజే లక్షమందికి వైరస్

ఇంతకు ముందెన్నడూ లేని తీవ్రత..రికార్డు స్థాయిలో కొత్త కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,03,558 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టి సుమారు 14 నెలలు కావొస్తున్నా..ఈ స్థాయిలో కొత్త కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. గతేడాది కరోనా మొదటి దశలో గరిష్ఠంగా 97,894 కేసులు నమోదయ్యాయి.  ప్రస్తుతం మొత్తం కేసులు 1,25,89,067కి చేరాయి. వైరస్ ఉద్ధృతి పెరుగుతుండటంతో.. కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 7,41,830కి పెరిగింది. క్రియాశీల రేటు 5.89కి చేరింది. ఇదిలా ఉండగా.. నిన్న 8,93,749 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం కావడంతో పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ, కేసుల్లో భారీ పెరుగుదల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

ఇంత ఉద్ధృతిలోని రికవరీలు ఊరటనిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,847 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 1,16,82,136కి చేరగా..ఆ రేటు 92.80 శాతానికి పడిపోయింది. తాజాగా 478 మంది మృత్యుఒడికి చేరగా..మొత్తంగా 1,65,101 మంది ప్రాణాలు వదిలారు. ఈ ఏడాదిలో ఒక దశలో 700పై చిలుకు మరణాలు సంభవించాయి. కొత్తగా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ..మరణాలు అదుపులోనే ఉండటం సానుకూల పరిణామం.

మహారాష్ట్రనే కేంద్ర బిందువు..
దేశవ్యాప్తంగా రెండో దశలో  కరోనా కలవరానికి..మహారాష్ట్రనే కేంద్ర బిందువుగా మారింది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు లక్ష దాటితే..దాంట్లో 57,074 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటేసింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 4.31లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న దాదాపు సగం మరణాలు(222) అక్కడే సంభవించాయి. అలాగే ఇప్పటివరకు 25 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  రోజురోజుకూ కరోనా పగ్గాలు లేకుండా విస్తరిస్తుండంతో మహా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూను విధించడంతో పాటు, వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 30 వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పంజాబ్‌కు ప్రజారోగ్య నిపుణులు, వైద్యుల బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. 

నిన్న 16.38లక్షల మందికి టీకా

దేశవ్యాప్తంగా మూడు దశల్లో అమలవుతోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 16,38,464 మందికి టీకా అందించారు. సుమారు మూడు నెలల కాలంలో కేంద్రం 7,91,05,163 టీకా డోసులను పంపిణీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా రెండో దశలో వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఇతర వయస్సులవారికి టీకా అందించాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని