Covid Vaccine: కొవిడ్‌ వ్యాక్సిన్‌| 100 కోట్ల ప్రయాణం.. ఇంకా సగం మిగిలే ఉంది!

తాజా వార్తలు

Updated : 19/10/2021 04:21 IST

Covid Vaccine: కొవిడ్‌ వ్యాక్సిన్‌| 100 కోట్ల ప్రయాణం.. ఇంకా సగం మిగిలే ఉంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా గత కొద్దినెలలుగా చేస్తున్న పోరులో భారత్‌ కీలక ఘట్టానికి చేరువైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో దేశం 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల మైలురాయిని చేరుకోనుంది. ఇదే జరిగితే చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన దేశంగా భారత్‌ కీర్తి గడించనుంది. 2021 జనవరి 16న ప్రారంభమైన ఈ మహోద్యమంలో ఎన్నో అడ్డంకులూ అవాంతరాలూ ఎదురైనా ఈ ప్రగతిలో దేశ ప్రజలందరి భాగస్వామ్యం కాదనలేనిది. మరి ఈ శతకోటి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అందుకున్న మైలురాళ్లేమిటి? చేరాల్సిన లక్ష్యానికి ఇంకెంత దూరంలో ఉన్నాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం పదండి..

ఆరంభంలో ఒడుదొడుకులు..

కొవిడ్‌ మహమ్మారిని అరికట్టడానికి దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు, ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభమైంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయడం మొదలు పెట్టారు. ఈ తొలి అడుగుల్లోనే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై విపక్షాల విమర్శలు, ప్రభుత్వం తిప్పికొట్టడంతోనే కొంత కాలం సరిపోయింది. అక్కడికి కొద్దిరోజులకే దేశాన్ని రెండో వేవ్‌ కుదిపేసింది. ఎప్పుడూలేని విధంగా 4 లక్షల కేసులు వెలుగుచూడడం, ఆక్సిజన్‌ కొరత వేధించింది. మరికొద్దిరోజులకు వ్యాక్సిన్లను రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్రం చెప్పడం.. కేంద్రమే చేపట్టాలని రాష్ట్రాలు లేఖలు రాయడం.. మళ్లీ కేంద్రమే సార్వత్రిక టీకా కార్యక్రమానికి పూనుకోవడంతో మరికొంతకాలం గడిచిపోయింది. అలా జూన్‌ 21 నుంచి అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. కొవిడ్‌పై పోరులో కీలక సమయం అక్కడే వృథా అయ్యిందనేది కాదనలేని సత్యం. ఇందులో కొవిడ్‌ రెండో వేవ్‌ పాత్ర కొంతైతే.. పాలకుల తప్పిదాలు మరికొంత. జూన్‌ తర్వాతే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంది.

ప్రస్తుతం ఇలా..

జూన్‌ నెలాఖరుకు రోజుకు 40 లక్షల డోసులు వేసే స్థాయి నుంచి గరిష్ఠంగా 2.18 కోట్ల డోసులు (సెప్టెంబర్‌ 17) వేసే స్థాయికి భారత్‌ చేరుకుంది. ప్రస్తుతం సగటున 80 లక్షల డోసులు వేస్తున్నారు. అలా అక్టోబర్‌ 18 నాటికి 98,19,11,523 డోసుల పంపిణీ పూర్తయ్యింది. ఇందులో 69,78,47,487 మందికి తొలి డోసు... 28,40,64,036 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ వేశారు. ఈ లెక్కన ఒకటి రెండ్రోజుల్లో 100 కోట్ల మైలురాయిని భారత్‌ అందుకోనుందన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తో్ది. ఇప్పటికీ వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నవారిని సైతం ఈ క్రతువులో భాగస్వామ్యం చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా రూపొందిన వీడియోలను విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలో కొవిడ్‌ కొత్త కేసులు సైతం తగ్గుముఖం పట్టిన వేళ ఈ వేడుక జరుపుకోవడం సంతోషకరమైన విషయం.

ఒక్కో చోట ఒక్కోలా..

కొవిడ్‌ను అంతం చేసే ఈ మహా క్రతువులో దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వంతు పాత్ర పోషించాయి. అయితే, ఇందులో ఎక్కువ పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే చిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌లో మిన్నగా ఉన్నాయి. సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌, చండీగఢ్‌, లక్షద్వీప్‌ వంటి చోట్ల 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ వేసుకోవడం గమనార్హం. గుజరాత్‌, కేరళ, దిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం దాదాపు 90 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు. అదే సమయంలో అధిక జనాభా కలిగిన బిహార్‌, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు 70 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకోగా.. మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి వంటి చిన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వెనకంజలో ఉన్నాయి.

డెడ్‌లైన్‌ సాధ్యమేనా..?

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ 2021 డిసెంబర్‌ 31 నాటికి వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్రం గతంలో పేర్కొంది. ఆ లెక్కన 90 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. వారందరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయాలంటే దాదాపు 190 కోట్ల టీకా డోసులు అవసరం. ప్రస్తుతం దేశంలో ఒక డోసు వేసుకున్న వారు 74 శాతం కాగా.. రెండు డోసులూ వేసుకున్న వారి శాతం కేవలం 30 శాతం మాత్రమే. అంటే కొవిడ్‌పై పోరులో మనం ఇంకా సగం దారిలోనే ఉన్నామన్నమాట. ప్రస్తుతం దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తున్న కొవిషీల్డ్‌ డోసుకు డోసుకు మధ్య 12-16 వారాల గడువు ఉంది. కొవాగ్జిన్‌ విషయంలో ఈ గడువు 4-8 వారాలే. మరోవైపు ప్రస్తుతం సీరం సంస్థ నెలకు 20 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. అలాగే, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దాదాపు 80 శాతానికి పైగా కొవిషీల్డ్‌ టీకానే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో డోసుల మధ్య గడువు ఎక్కువ ఉండడం, కంపెనీ చేస్తున్న ఉత్పత్తి లెక్కల ప్రకారం కేంద్రం నిర్దేశించుకున్న గడువులోపు అందరికీ వ్యాక్సిన్‌ వేయడం వీలుపడదనేది విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌ నెలలో వ్యాక్సినేషన్‌లో వేగం తగ్గుముఖం పట్టడం మరో కారణం. ఈ లెక్కన వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికే అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు కొవిడ్‌ రక్కసి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. ఎందుకంటే వ్యాక్సిన్‌ అనేది కొవిడ్‌ రాకుండా పూర్తిగా అడ్డుకోదని, అవకాశాలను మాత్రం తగ్గిస్తుందనేది వైద్య నిపుణులు చెబుతున్నమాట. కాబట్టి ఎప్పటిలానే కొవిడ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి!!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని