3300 ప్రెజర్‌ కుక్కర్లు సీజ్‌! 
close

తాజా వార్తలు

Published : 27/02/2021 19:34 IST

3300 ప్రెజర్‌ కుక్కర్లు సీజ్‌! 

అరియలూరు: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందే తడవుగా తమిళనాట ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి! ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే అరియలూరు జిల్లాలో అధికారులు భారీగా ప్రెజర్‌ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. గుమ్మడిపూండి నుంచి రెండు లారీలలో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నారు. టీటీవీ దినకర్‌న్‌కు చెందిన ఏఎంఎంకే పార్టీ గుర్తు కూడా ప్రెజర్‌ కుక్కరే. ఈ కుక్కర్‌ ప్యాక్‌లపై దివంగత మాజీ సీఎం జయలలిత, శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్‌తో పాటు ఆ పార్టీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి వేలు కార్తికేయన్‌ ఫొటోలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో కూడిన ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం వరణవాసి సమీపంలోని సమతువపురం వద్ద ఓ లారీ ఆపారు. ఆ లారీలో ఉన్న సిబ్బంది అవి ఖాళీ పెట్టెలేనని చెప్పడంతో వదిలేశారు. అయితే, కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరో లారీ అదే దారిలో రాగా దాన్ని ఆపి తనిఖీ చేశారు. దాంట్లో 1600 ప్రెజర్‌ కుక్కర్లు ఉన్నట్టు గుర్తించారు. లారీలోని సిబ్బందిని ప్రశ్నించగా.. ప్రెజర్‌ కుక్కర్లను తంజావూర్‌ వైపు తరలిస్తున్నట్టు చెప్పారు. దీంతో అంతకుముందు వదిలేసిన లారీపై మరో అధికారుల బృందాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఆ లారీని తిరుమనూర్‌ చెక్‌పోస్టు వద్ద అడ్డుకొని మరో 1700 కుక్కర్లను స్వాధీనం చేసుకొని లారీలను సీజ్‌ చేశారు. ఈ కుక్కర్ల విలువ రూ. 12లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించినవేనా? లేదంటే ఇంకే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని