ఈ దశాబ్దం ‘భారత్‌ టెకేడ్‌’: మోదీ

తాజా వార్తలు

Updated : 01/07/2021 22:00 IST

ఈ దశాబ్దం ‘భారత్‌ టెకేడ్‌’: మోదీ

సాంకేతికతను అలవరచుకోవడంలో ‘డిజిటల్‌ ఇండియా’ కీలక పాత్ర

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో కోట్ల మందికి సేవలను అందించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలు ఎంతగానో సులభతరం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దశాబ్దిలో డిజిటల్‌ టెక్నాలజీలో భారత్‌ తన సామర్థ్యాలను మరింత పెంచుకోవడంతోపాటు.. అంతర్జాతీయ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వాటా మరింత పెరుగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే అత్యున్నత నిపుణులు ఈ దశాబ్దాన్ని ‘ఇండియా టెకేడ్‌’ (Tech Decade)గా వ్యవరిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్‌ ఇండియా ఆరో వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

సాంకేతికతను అలవరచుకోవడంలో డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒకే దేశం- ఒకే రేషన్‌ పథకం అమలు చేయడంతోపాటు ఇతర సేవలను అందించడంలో డిజిటల్‌ టెక్నాలజీ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇక దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలోనూ ‘ఆరోగ్యసేతు’ యాప్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. మహమ్మారి విజృంభణ వేళ విద్యావ్యవస్థ, ఆరోగ్యసేవలతో పాటు పౌర సేవలను పొందడంలో టెక్నాలజీ పాత్రను వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్‌ అభివృద్ధి చేసిన సాంకేతికతను ప్రపంచ దేశాలు గుర్తించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా దీక్ష, ఈ-నామ్‌, ఈ-సంజీవని సాంకేతికతను వినియోగిస్తోన్న లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు.

ఇదిలాఉంటే, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన కొవిన్‌ పోర్టల్‌పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కిపైగా దేశాలు ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అవసరమైన దేశాలతో కొవిన్‌ పోర్టల్‌కు సంబంధించిన సాంకేతికతను పంచుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని