
తాజా వార్తలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్!
రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్..
కశ్మీర్: భారతీయ రైల్వే జమ్మూ-కశ్మీర్లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ నదిపై నిర్మితమవుతోంది. మరి కొద్ది రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తికానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ట్విటర్ ద్వారా తెలిపారు. ‘చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు కానుంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో అద్భుతం. భారతీయ రైల్వే ఒక గొప్ప మైలురాయిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఇంజినీర్ల సామర్థ్యానికి ఈ బ్రిడ్జ్ చిహ్నంగా నిలిచిపోతుంది. దీని నిర్మాణ పనులు 2021 మార్చి నాటికి పూర్తవుతాయి’ అని మంత్రి ట్వీట్ చేశారు.
ఈ మేరకు వంతెనకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో పంచుకున్నారు. నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొంకణ్ రైల్వే ఆధ్వర్యంలో ఉద్ధమ్‌పూర్-శ్రీనగర్-బారముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు కింద 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ ప్రాంతంలో గాలి వేగం అధికంగా ఉండటంతో రైలు ప్రయాణీకుల భద్రత దృష్ట్యా 2008-09 కాలంలో పనులు నిలిచిపోయినట్లు రైల్వే శాఖ తెలిపింది. 2017 నుంచి వంతెనకు స్టీల్ ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ద్వారా జమ్ము, కశ్మీర్ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.